ట్రావెల్‌ ఫ్రం హోం!

24 May, 2020 03:24 IST|Sakshi

కరోనా నేపథ్యంలో వర్చువల్‌ ట్రావెల్‌పై పర్యాటక ప్రేమికుల ఆసక్తి

ఇంటి నుంచే ప్రపంచ పర్యాటక కేంద్రాల సందర్శనపై మక్కువ

అందుకు అనుగుణంగా ప్లాన్స్‌ సిద్ధం చేసిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీలు

సాక్షి, హైదరాబాద్‌: వర్క్‌ ఫ్రం హోం అంటే తెలుసు కానీ ఈ ట్రావెల్‌ ఫ్రం హోం ఏమిటి అనుకుంటున్నారా? విదేశాల్లోని ప్రముఖ పర్యాటక, ప్రసిద్ధ కేంద్రాలకు మనం స్వయంగా వెళ్లకుండానే అక్కడకు వెళ్లినట్లుగా, వ్యక్తిగతంగా అన్నింటినీ సొంతంగా వీక్షిస్తున్నట్లుగా అనుభూతి పొందేలా చేసేవే ‘వర్చువల్‌ ట్రావెల్‌’, ‘ట్రావెల్‌ ఫ్రం హోం’. ఇది ఇప్పటికే ‘నెట్టింట’అందుబాటులో ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం దీనికి ఇప్పటిదాకా అంత ప్రాచుర్యం లభించలేదు. అయితే ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కమ్మేసిన నేపథ్యంలో వర్చువల్‌ ట్రావెల్‌పై దేశంలోని పర్యాటక ప్రేమికులు సైతం అధిక ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సమేతంగా చేపట్టే విదేశీ టూర్లకు అయ్యే ఖర్చు, శ్రమతో పోలిస్తే ‘ట్రావెల్‌ ఫ్రం హోం’ఖర్చు చాలా తక్కువే కావడంతో వాటిపట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు వర్చువల్‌ టూర్లు ఆఫర్‌ చేసే సంస్థలు కొత్త ప్లాన్లతో ముందుకొస్తున్నాయి.

360 డిగ్రీల కోణంలో... 
విదేశీ పర్యాటకం అధికంగా సాగే వేసవిలో కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని చుట్టేయడం, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశాలన్నీ సరిహద్దులను మూసేసి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనజీవనం స్తంభించింది. ఫలితంగా విదేశాల్లోనే కాకుండా దేశీయంగానూ పర్యాటక, రవాణా, ఆతిథ్య తదితర అనుబంధ రంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఈ తరుణంలో దేశ, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, మ్యూజియాలు, ముఖ్య కట్టడాలను ఇల్లు కదలకుండానే వీక్షించేందుకు లోకల్‌ ఎక్స్‌పర్ట్‌ భాగస్వాములతో కలిసి ఎక్స్‌పీడియా అనే అంతర్జాతీయ ట్రావెల్స్‌ సంస్థ వర్చువల్‌ టూర్లను ఆఫర్‌ చేస్తోంది.

ట్రావెల్‌ ఫ్రం హోం సిరీస్‌లో భాగంగా వర్చువల్‌ ట్రావెల్‌తోపాటు సాంస్కృతిక, విద్య, వినోద అనుబంధ రంగాల్లోని విశేషాలను, వాటికి సంబంధించిన టూర్లను ఇళ్లలో తీరికగా కూర్చొని ఆయా ప్రదేశాల్లో పర్యటించిన అనుభూతి పొందేలా ప్రణాళికకు రూపకల్పన చేసింది. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి ఆన్‌లైన్‌లో వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), వెబ్‌కామ్‌లు, కంప్యూటర్‌ల ద్వారా 360 డిగ్రీల కోణంలో లైవ్‌ స్ట్రీమ్‌ల ద్వారా ఆయా పర్యాటక కేంద్రాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తోంది. మరికొన్ని సంస్థలు సైతం ఇదే తరహా టూర్‌ ప్యాకేజీలు అందిస్తున్నాయి.

టూర్‌ గైడ్‌లతో లైవ్‌ వీడియో టూర్‌..
కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, విదేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను చూడాలని పర్యాటక ప్రేమికులు కోరుకోవడం, దాని కోసం పెద్దమొత్తం ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక, సాంస్కృతిక, ఇతర కేంద్రాల్లోని టూర్‌ గైడ్‌లతో లైవ్, ఇంటరాక్టివ్‌ వీడియో సెషన్ల ద్వారా ‘రిమోట్‌ ట్రావెల్స్‌’నిర్వహిస్తున్నారు. ఆత్మీయులతోనో, స్నేహితులతోనో కలసి కొత్త ప్రదేశాన్ని చూస్తున్న అనుభూతిని కలిగించేలా మనకు నచ్చిన, చూడాలని కోరుకున్న పర్యాటక కేంద్రాలు, వాటి గురించిన ఆసక్తికర వివరాలను టూర్‌ గైడ్లు వివరించేలా ఏర్పాట్లు చేశారు.

ఆయా ప్రాంతాలను చూడాలని అనుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ‘ప్రివ్యూ’లను కూడా గైడ్లు ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియాలను డిజిటల్‌ టూర్ల మాదిరిగా చూసే అవకాశం లభిస్తోంది. గూగుల్‌ స్ట్రీట్‌ ద్వారా ఆధునిక, సమకాలీన చిత్రకళ ప్రదర్శనలను వీక్షించే వీలు కల్పిస్తున్నారు. అయితే బ్రిటిష్‌ మ్యూజియం పర్యటనకు విషయానికొస్తే మాత్రం ఇది గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌లో లేకపోవడంతో బ్రిటిష్‌ మ్యూజియం వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి వస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు