అక్కడ చూడదగిన ప్రదేశాలెన్నో...

25 Nov, 2019 10:55 IST|Sakshi

సిరాలలో ఇనుపరాళ్ల గుట్ట..

కల్లూరులోఅభినవ షిర్డీ

లోకేశ్వరంలో బ్రహ్మేశ్వర ఆలయం

సరిహద్దు మహారాష్ట్రలో కర్ర గణేషుడు

ప్రసిద్ధిగాంచిన చదువుల తల్లి సరస్వతీ క్షేత్రం ముథోల్‌ మండలం బాసరలో నెలవైంది. ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. చిన్నారులకు అమ్మవారి చెంత అక్షర శ్రీకారపూజలు జరిపించాకే బడుల్లోకి పంపుతారు. పర్వదినాల్లో ఇక్కడ భక్తులు లక్షల్లో తరలివస్తారు. గోదావరి నది ఒడ్డున సూర్యేశ్వరస్వామి ఆలయం ఉంది. సరస్వతీ అమ్మవారి ఆలయం పక్కనే కాళికమాత, దత్తాత్రేయ, వ్యాసమహర్షి ఆలయాలు  నెలకొన్నాయి. బాసర పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఇక్కడికి వచ్చే వారు చుట్టుప్రక్కల ఆలయాలను దర్శించుకోవచ్చు. బాసరకు చేరుకునేందుకు రైలు మార్గం కూడా ఉంది. బాసర స్టేషన్‌దాటితే మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ స్టేషన్‌ వస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం, సికింద్రాబాద్, హైదరాబాద్‌ డిపోల నుంచి బాసరకు బస్సులు వస్తుంటాయి.
– భైంసా(ముథోల్‌)

భైంసా మండలంలో...
భైంసా నుంచి నాందేడ్‌ వెళ్లే మార్గంలో 61వ జాతీయ రహదారిపై బోంద్రట్‌ ఎక్స్‌రోడ్డు వద్ద నుంచి సిరాల వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో సిరాల గ్రామం కనిపిస్తుంది. భైంసా – బాసర మార్గంలోనూ ఇలేగాం గ్రామం మీదుగా ఆరు కిలో మీటర్ల దూరంలోని సిరాల గ్రామం చేరుకోవచ్చు. గుట్ట చుట్టూ ఉన్న ఇనుపరాళ్లపై గతంలో పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. అగ్గి పెట్టె లేని రోజుల్లో దూది సహాయంతో ఈ బండల మధ్యన కొట్టి మంటను చేసే వారని పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు. 

గుట్టచుట్టూ గృహాలే...
ఇనుపరాళ్ల గుట్టపై చుట్టూ గృహాలున్నాయి. ఈ సొరంగ మార్గాలు రాజుల కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతారు. సిరాల గుట్టపై ఆలయం పక్కనే ఉన్న గృహాల్లో అప్పట్లో పుట్టెడు మేకలు వదిలితే బాసర గోదావరి సమీపంలోని గృహాల్లో కనిపించాయని ఇప్పటికీ చెబుతారు. రానురాను వీటిపై ఆశ్రద్ధ చేయడంతో ప్రస్తుతం గృహాల్లో పిచ్చిమొక్కలు మొలకెత్తాయి. విష సర్పాలు తిరుగుతున్నాయి. 

ఏళ్లనాటి మర్రి చెట్టు
ఎడ్లబండ్లపై, ద్విచక్రవాహనాలపై ఇక్కడికి చేరుకున్న వారు గుట్ట ఎక్కే ప్రాంతంలో ఉన్న మర్రి చెట్టు నీడలో సేదతీరుతారు. టెంట్‌ అవసరం లేకుండా 600 మంది ఒకే సారి సేదతీరేలా నీడను ఇచ్చే మర్రి చెట్టు వద్ద ఆగుతారు. ఏళ్లనాటి మర్రి చెట్టు ఊడలు సైతం భూమిలో చొచ్చుకుపోయాయి. ఎటు చూసినా మర్రి చెట్టు ఊడలే కనిపిస్తాయి. 


భైంసా మండలం సిరాలగుట్టపై ఉన్న మర్రిచెట్టు, సిరాలలో ఇనుపరాళ్ల గుట్ట

గుట్టపై హరిహారాలయం
సిరాల ఇనుపరాళ్ల గుట్టపై ప్రసిద్ధి చెందిన హరిహారాలయం కనిపిస్తుంది. ఎక్కడ లేని విధంగా ఆలయంలో రెండు శివలింగాలు కనిపిస్తాయి. హరిహారాదులే ద్విలింగాలుగా వెలిశారని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తారు. శ్రావణ మాసంతోపాటు ఇతర పర్వదినాల్లో భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ఇనుపరాళ్ల గుట్టను, గృహాలను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. గుట్ట పక్కనే నైజాం కాలంలో నిర్మించిన చెరువును చూసేందుకు ఆసక్తి చూపుతారు.

లోకేశ్వరం మండలంలో
లోకేశ్వరం మండలంలో గోదావరి నది ఒడ్డున ప్రముఖ శివాలయం ఉంది. బ్రహ్మేశ్వరఆలయంగ పిలువబడే ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆలయం వద్ద గోదావరి నదిలో స్నానాలు చేసి పూజలు చేస్తుంటారు. కాకతీయులకాలంలో నిర్మించిన పురాతన ఆలయం ఇది. ఇక్కడ కాకతీయులు రాసిన శిలాశాసనాలు బండరాళ్లపై ఇప్పటికీ ఉన్నాయి. 

ముథోల్‌ మండలంలో
ముథోల్‌ మండలంలో స్వయంబుగా వెలిసిన పశుపతినాథ్‌ ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తుంది. ప్రతి సోమవారం ఇక్కడ భక్తులు కిక్కిరిసికనిపిస్తారు. ముక్తేశ్వర ఆలయం, శివాలయం, రామ మందిరంలోనూ పూజలు జరుగుతాయి. ఎడ్‌బిడ్‌ గ్రామంలోని మల్లన్నస్వామి ఆలయం, కారేగాంలోని ఎల్లమ్మ ఆలయాల్లో ప్రతి ఆదివారం పూజలు చేస్తారు. తానూరు మండలంలోని విఠలేశ్వర ఆలయం, బోసి గ్రామంలోని కాశీవిశ్వేశ్వర ఆలయం, బెల్‌తరోడలోని దత్తాత్రేయ ఆలయాల్లోనూ ప్రతినిత్యం పూజలు జరుగుతాయి.  

కుంటాల మండలంలో
కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో నిర్మించిన సాయిబాబా ఆలయానికి ప్రతి రోజు లక్షల సంఖ్యల్లోనే భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం అభినవ షిర్డీగా పేరు పొందింది. భైంసా – నిర్మల్‌ వెళ్లే  61వ జాతీయ రహదారిపై కల్లూరు గ్రామ చేరువలోనే గుట్టపై సాయిబాబా ఆలయం కనిపిస్తుంది. ప్రతి గురువారం  భక్తులు ఇక్కడికి వస్తుంటారు. షిర్డీ తరహాలోనే కల్లూరు ఆలయంలోనూ ప్రతి నిత్యం పూజలు చేస్తుంటారు. కుంటాలలో శ్రీకృష్ణ మందిరం ఉంది. ఇక్కడే గజ్జలమ్మ ఈ ప్రాంతవాసుల ఇలవెల్పుగా పూజలు అందుకుంటుంది. ప్రతి ఆదివారం కేశఖండనాలు, నామకరణాలు జరుపుతూ పక్క రాష్ట్రం నుంచి భక్తులు వస్తారు.

సరిహద్దు ప్రాంతంలో
కుభీర్‌ మండలం సిర్పెల్లిదాటగానే సరిహద్దు మహారాష్ట్ర గ్రామమైన పాలజ్‌ గ్రామం కూడా ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ కోరికలు తీర్చే కర్రగణేషుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి ప్రతి రోజు భక్తులు వస్తుంటారు. గణేషున్ని మొక్కుకున్నవారు ముడుపులు కట్టి వెళ్తారు. మొక్కులు తీరగానే మళ్లీ వచ్చి ముడుపులను విప్పుతారు. ప్రతి వినాయక చవితికి ఇక్కడ జనం కిక్కిరిసి ఉంటారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో దీక్షలు తీసుకుంటారు. కుభీర్‌ మండలంలో విఠలేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ మండలంలోని పార్డి(బి)లో రాజరాజేశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రతి సోమవారం కనిపిస్తుంటారు. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో స్వామిపేరే ఎవరో ఒకరికి పెట్టుకోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు