మానేరు.. జనహోరు

2 Sep, 2019 11:14 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం వద్ద జనజాతర సాగింది. జలాశయం 23 గేట్లు ఎత్తి నీటిని ఎల్‌ఎండీకి వదలడంతో ఆ దృశ్యాన్ని తిలకించేందుకు జనం బారులు తీరారు. మధ్యమానేరు నిండా నీటితో కనువిందు చేస్తుండగా.. గేట్ల నుంచి నీళ్లు దిగువకు దూకుతున్న మనోహరమైన దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో సందర్శకులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. జలాశయం నీరు మానేరులోకి ప్రవహిస్తుంటే.. జనం ఆనందంగా తిలకించారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనజాతర సాగుతూనే ఉంది.

ఎవరికీ పట్టని వాహనదారుల గోడు..
కొదురుపాక నుంచి ప్రాజెక్టు కట్టపైకి దారి మూసి వేశారు. వెంకట్రావుపల్లె, మాన్వాడ నుంచి వెళ్లే రోడ్డు ఒక్కటే ఉండడంతో వాహనాల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు దిగువ(కట్టకింద) ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనాలు రోడ్డు దిగితే.. మట్టిలో కూరుకుపోయాయి. రద్దీని నియంత్రించే ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. వర్షాలకు మట్టి బాగా తడిసి ఉండడంతో జనం జారిపడ్డారు. అటు నీటిపారుదలశాఖ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎవరూ ట్రాఫిక్‌ ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే వారు ఇబ్బందులు పడుతుంటే.. కనీస ఏర్పాట్లు చేయడంతో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బోయినిపల్లి పోలీసులు జలాశయం వద్దకు వచ్చినా.. ట్రాఫిక్‌ నియంత్రణలో ఇబ్బందులను అధిగమించలేకపోయారు. సందర్శకులకు పార్కింగ్‌ సదుపాయంతో పాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. 
 నీటి అలలపై ఫొటోషాట్‌
సెల్ఫీ తీసుకుంటున్న యువతి 

మరిన్ని వార్తలు