నిండుకుండలా పులిచింతల ప్రాజెక్ట్‌

16 Aug, 2019 11:40 IST|Sakshi
పులిచింతల ప్రాజెక్ట్‌పై సందర్శకులు

సాక్షి, హుజూర్‌నగర్‌: నాగర్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పులిచిం తల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను రాత్రి 9 గంటలకు 38.75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోగా 7.21 లక్షల నీరు వస్తుండగా ప్రాజెక్ట్‌లోని 22గేట్లనుఎత్తి 7.10 లక్షల క్యూసెక్‌ల నీటిని దిగువకు వదులుతున్నారు.  

ప్రాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి..
నిండుకుండా మారిన పులిచింతల ప్రాజెక్ట్‌ అందా లను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తున్నారు. సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నది అందాలను తమ సెల్‌ ఫోన్‌లో బంధిస్తున్నారు. ప్రాజెక్ట్‌ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారింది. 

ముంపు గురవుతున్న పంట పొలాలు...
భారీగా  వరద నీరు రావండతో పులిచింతల బ్యాక్‌ వాటర్‌ అంతకంతకూ పెరుగతోంది. దీంతో ముంపు గ్రామాల పరిధిలో ఉన్న పొలాల్లోని పత్తి, మిర్చి, వరి పొలాలు నీట మునుగుతున్నాయి. 

రోడ్డుపైకి వచ్చిన వరద...
పులిచింతల ప్రాజెక్ట్‌లో బ్యాక్‌ వాటర్‌ అంతకంతకూ పెరుగుతుండడంతో వాగులు వంకలు, కయ్యలను ముంచెత్తుతోంది. ఆ నీరు రోడ్లపైకి చేరుతోంది. వెల్లటూరు గ్రామ శివారులోని తాళ్లవాగులోకి వరద నీరు చేరింది. అంతే కాకుండా శోభనాద్రిగూడెం చెరువుకట్టపైకి వచ్చింది. దీంతో మిగతా గ్రామాలకు ఈ రహదారిలో రాకపోకలు బందయ్యాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించి నడుపుతున్నారు.

పునరావాస కేంద్రాలకు తరలింపు...
పులచింతల ముంపు గ్రామాల్లో ఇంకా నివాసం ఉంటున్న వారిని అధికారులు పునరావాస  కేంద్రాలకు తరలిస్తున్నారు. రేబల్లె, తమ్మారం ఎస్సీ కాలనీ, శోభనాద్రిగూడెం గ్రామంలోని ప్రజలను ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పిస్తున్నారు. 

జేసీ, డీఆర్‌ఓ సందర్శన...
ముంపు గ్రామాలను జేసీ సంజీవరెడ్డి, డీఆర్‌ఓ చం ద్రయ్య సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ శివరాంరెడ్డి, తహసీల్దార్‌లు కమలాకర్, జవహర్‌లాల్, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, ప్రవీణ్‌ కుమార్, దశరధ్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు