హైదరాబాద్‌లో జర్నలిస్టు టౌన్‌షిప్

30 Jan, 2016 04:21 IST|Sakshi
హైదరాబాద్‌లో జర్నలిస్టు టౌన్‌షిప్

 వంద ఎకరాల్లో సకల సౌకర్యాలతో ప్రభుత్వ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం
 పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్లకన్నా అదనంగా నిధులు
 హైదరాబాద్, వరంగల్  తరువాత అన్ని జిల్లా కేంద్రాల్లో టౌన్‌షిప్‌లు
 వచ్చే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
 జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ హామీ
 హౌసింగ్ సొసైటీల రద్దుకు జర్నలిస్టు సంఘాల అంగీకారం

 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సమాజహితం కోసం పనిచేసే ప్రతి జర్నలిస్టు కుటుంబానికి, పిల్లలకు ఇల్లు రూపంలో ఒక ఆస్తి మిగలాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. బ్యూరో, డెస్క్, ఫొటో, వీడియో తదితర విభాగాలన్నింటికి సంబంధించిన జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇళ్లు నిర్మించడానికి దాదాపు వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని, పేదల కోసం కట్టే డబుల్ బెడ్‌రూం ఇళ్లకిచ్చే దానికి అదనంగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ టవర్లు, క్లబ్‌హౌజ్, మార్కెట్, స్కూల్, ప్లేగ్రౌండ్, పార్కు, మల్టీప్లెక్స్ ఉండేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మిస్తామని వెల్లడించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమ ర్, క్రాంతికిరణ్, రవి, శైలేష్‌రెడ్డి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. జర్నలిస్టు టౌన్‌షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు రఘునందన్, రోనాల్డ్ రాస్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు. అధికారులు, జర్నలిస్టు నాయకులు శని వారం నగరంలో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. స్థలం ఎంపిక చేసుకున్న వెంటనే మంచి లే అవుట్ రూపొందించి మార్చిలోనే శంకుస్థాపన చేసి, ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేది తన ఆలోచనగా సీఎం చెప్పారు.  సీఎం స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో.. గతంలో ఏర్పాటైన హౌసింగ్ సొసైటీలను రద్దు చేసుకునేందుకు జర్నలిస్టు సంఘాల నాయకులు అంగీకరించారు. సొసైటీల ద్వారా జర్నలిస్టులు గతంలో ప్రభుత్వానికి డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో మొదటివిడత టౌన్‌షిప్‌లు నిర్మిస్తామని, దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల కోసం రెసిడెన్షియల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లోనే జర్నలిస్టుల ఇళ్ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు కేసీఆర్ చెప్పారు.

మరిన్ని వార్తలు