‘గూడెం’లో ప్రబలుతున్న విషజ్వరాలు

13 Aug, 2015 04:18 IST|Sakshi
‘గూడెం’లో ప్రబలుతున్న విషజ్వరాలు

గంగబిషన్ బస్తీలో రెండు డెంగీ కేసులు నమోదు
{పభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో
పెరుగుతున్న రోగుల సంఖ్య
మున్సిపాలిటీ పాత్రపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
 
 కొత్తగూడెం అర్బన్ : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 40 రోజులుగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెతో వార్డుల్లో పేరుకపోయిన చెత్తాచెదారం, డ్రైనేజీల్లో నిల్వ ఉన్న సిల్టుతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. స్థానిక గంగభిషన్‌బస్తీలో రెండు డెంగీ కేసులు బుధవారం నమోదయ్యాయి.

వీరు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతోపాటు పట్టణంలోని మురికివాడలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా విషజ్వరాల బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓపీ విభాగంలో చికిత్స కోసం రోజుకు 150 మంది వచ్చేవారు. ప్రస్తుతం దాదాపు 300 పైన రోగులు జ్వరాలతో వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

 మున్సిపల్ పాత్రపై అసహనం..
 మున్సిపాలిటీలోని వార్డుల్లో విషజ్వరాలు ప్రబలుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో డైలీ లేబర్స్‌తో పనులు చేయిస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తుందంటున్నారు. చెత్తాచెదారంతో విపరీతంగా ఈగలు, దోమలు ఇళ్లలోకి వచ్చి కుట్టడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు వివరిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా వార్డులో దోమల నివారణకు ఫాగింగ్, దుర్వాసన రాకుండా బ్లీచింగ్ వంటివి కూడా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి వార్డుల్లో బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి నిర్వహించాలని, దీంతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు