ఆకట్టుకున్న టీపీఏడీ వన భోజనాల కార్యక్రమం

8 May, 2015 15:13 IST|Sakshi

డల్లాస్: గత వారం టెక్సాస్ లోని ఫ్రిక్స్ హిడెన్ పార్క్ లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నిర్వహించిన వన భోజనాల కార్యక్రమం ఆకట్టుకుంది. సుమారు 1500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా సాగింది. వన భోజనాల సాక్షిగా  ఇక్కడకు విచ్చేసిన వారు తమకు నచ్చిన ఆట పాటలతో అలరించి తెలుగు జాతిలో గొప్పదనాన్ని చాటుకున్నారు. ఇక్కడ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా కలిసి ఆనందం సంబరాల్లో మునిగి తేలారు. పురుషులు క్రికెట్, వాలీబాల్ వంటి గేమ్ లను ఆడగా, మహిళలు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర కార్యక్రమాలతో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు  ప్రత్యేకంగా సాంస్కృతిక నృత్యాలతో ఆకట్టుకోగా, 40 మందికి పిల్లలు ఫ్లాష్ మోబ్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించారు.

మే 2 వ తేదీన టీపీఏడీ నిర్వహించిన ఈ వన భోజనాల కార్యక్రమం తెలుగు జాతి స్పూర్తికి, ఆకర్షణకు నిదర్శమని నిర్వాహకులు తెలిపారు. ప్రధానంగా 1500 మందికి భోజనాలను వండి వడ్డించడాన్ని మహిళలు ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. ఇందులో డజనుకు పైగా నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఆహార పదార్థాలను తయారు చేశామని స్పష్టం చేశారు. తెలుగు వారి అభ్యున్నతికి సహకరించే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు