హైదరాబాద్‌కు మహాభాగ్యం.. ఆవాసయోగ్యం

2 Jul, 2020 11:21 IST|Sakshi

మూడు ఐఐటీలు, రెండు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ప్రతిపాదనల పరిశీలన

ఈ నెలాఖరుకల్లా వీటిలో ఒక సంస్థకు బాధ్యతలు అప్పగింత

కాలుష్య వ్యాప్తి– నివారణ చర్యలపై ఏడాదిలో నివేదిక

హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలుల కోసం కార్యాచరణ ప్రణాళిక

సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్రం మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరాన్ని స్వచ్ఛమైన వాయువు, నీళ్లతో ప్రపంచస్థాయిలోనే మంచి ఆవాసమైనదిగా మార్చే కృషికి మరో ముందడుగు పడింది. నగరంలో వాయునాణ్యతను గణనీయంగా పెంచేందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం ఈ రంగంలో కృషి చేస్తున్న ఉన్నతస్థాయి ప్రమాణాలున్న సంస్థ సాయం తీసుకోనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ రూపాల్లో కాలుష్య కారకాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఒక ప్రాజెక్ట్‌ను అప్పగించనుంది. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌కు చెందిన (నీరి), ఢిల్లీకి చెందిన (తెరి), కాన్పూర్, ముంబై, ఢిల్లీ ఐఐటీల నుంచి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ సంస్థలన్నింటికి కూడా కాలుష్య నియంత్రణ ముఖ్యంగా వాయు నాణ్యత మెరుగుపై వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో ఇవి సమర్పించే నివేదికల ఆధారంగా ఏదో ఒక దాన్ని షార్ట్‌ లిస్ట్‌ చేసి ఈ నెలాఖరుకల్లా ప్రాజెక్ట్‌ను అప్పగించనున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఈ బాధ్యతలను అప్పగించాక సదరు సంస్థ ఏడాది కాలంలో వాహన, రోడ్డు దుమ్ము, బయో మాస్‌ దహనం, పారిశ్రామిక, భవననిర్మాణ, ఇతర రూపాల్లో కాలుష్యం వ్యాప్తి చెందుతోంది. దీని నివారణకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. 

గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు...
తెలంగాణలో నాలుగోవంతుకు (కోటికి పైగానే) పైగా ప్రజలు ఇక్కడే నివాసం ఉంటుండడంతో వారికి స్వచ్ఛమైన గాలి అందేలా వాయుకాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భాగ్యనగరాన్ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు వివిధ రూపాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా స్వచ్ఛమైన గాలులతో ఇతర నగరాలతో పోల్చితే మెరుగైన వాయు నాణ్యత సాధించేందుకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజలకు మెరుగైన వాయువును అందించే కృషి సాగుతోంది.

ఇదే ప్రథమం...
తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్‌లో వాయు నాణ్య తను పెంచేందుకు ఒక ఉన్నతస్ధాయి సంస్థకు బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రధమం. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007కు ముందు కొన్ని ప్రయత్నాలు మొదలుకాగా, అందులో భాగంగా సీఎన్‌జీ ఇంధనంతో పాటు బస్సులు, వాహనాలు హైదరాబాద్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2003–2010 మధ్యలో కొంత ముందడుగు పడింది.దేశంలోని పది కాలుష్య ప్రభావిత నగరాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బూరేలాల్‌ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు మొదలుపెట్టారు.ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ అంశానికి ప్రాధామివ్వకపోవడంతో ఈ ప్రయత్నాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ ఆదేశాలు...
2014 కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక, 2015 నుంచి కార్యాచరణ చేపట్టారు. వాయునాణ్యతను పెంచేందుకు...కాలుష్యస్థాయిని తగ్గించేందుకు సీఎన్‌జీ వాహనాల వినియోగం, కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)అవతలకు తరలింపు, నగరంలో వాహనాలకు బీఎస్‌–6 (భారత ప్రమాణాలు–6) అమలుతో పాటు ట్రాఫిక్‌ ఫ్లోకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఏ రకం వాహనాలకు కేటాయించిన లైన్‌లో అవి వెళ్లేలా ‘లేన్‌ క్రమశిక్షణ’పాటించేలా చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వాయు నాణ్యత పర్యవేక్షక కమిటీ నిర్ణయించింది. ప్రాధాన్యతా ›క్రమంలో ఔటర్‌ ఓఆర్‌ఆర్‌ అవతలికి కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు చెందిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని పరిశ్రమల శాఖను ఈ కమిటీ ఆదేశించింది. గడువు తీరిన పాత వాహనాలను రోడ్లపైకి రాకుండా చేయడంతో పాటు కాలుష్య కారక వాహనాలపై జరీమానాల విధింపు, విద్యాసంస్థల బస్సులు సీఎన్‌జీని ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా