నేడు టీపీసీసీ చలో రాజ్‌భవన్

7 Feb, 2015 01:06 IST|Sakshi

హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రస్తుత పరిస్థితులు, సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు శనివారం వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనాయకులు గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు.

ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించి, అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నాయకులు నివాళులర్పిస్తారు. తర్వాత లక్డీకాపూల్ మీదుగా ఖైరతాబాద్‌కు, అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర ఉంటుంది. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ముఖ్య నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, జె.గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ,  మహ్మద్ షబ్బీర్ అలీ, తదితర నేతలు పాల్గొంటారు. కాగా.. టీపీసీసీ చలో రాజ్ భవన్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు నగర అదనపు కమిషనర్ (శాంతి, భద్రతలు) అంజనీకుమార్ స్పష్టంచేశారు.

9 నుంచి దళిత చైతన్యయాత్ర
దళితులను అణగదొక్కేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ఎస్సీ విభాగం ఆరోపించింది. తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు రక్షణ ఉండదన్న భయాన్ని కలిగిస్తున్నారని, సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ నెల 9-13 తేదీల్లో దళితచైతన్య యాత్ర పేరిట రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించాలని  నిర్ణయించింది. 9న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సాగనుంది. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన భేటీలో ఎస్సీ విభాగం చైర్మన్ ఎ.కృష్ణ, నాయకులు మల్లురవి, అద్దంకి దయాకర్, కె.మానవతారాయ్, గజ్జెలకాంతం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు