కాంగ్రెస్‌ నేతల గృహ నిర్బంధం

11 Jun, 2020 10:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లు పంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నేడు చలో సెక్రటేరియేట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సచివాయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా కాంగ్రెస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్‌రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై కరెంట్‌ బిల్లుల భారం వేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. స్లాబులు పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం)

కేసీఆర్‌ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అడ్డగోలు విద్యుత్‌ బిల్లులు, నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనాపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించేందుకు అపాయిమెంట్‌ మాత్రమే అడిగామని, సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదన్నారు. కనీస సమాచారం కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. పాలన నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. (స్వయం ప్రకటిత లాక్‌డౌన్‌లో ఐటీ)

>
మరిన్ని వార్తలు