రిజర్వేషన్లు తేలకముందే మున్సిపోల్స్‌కు షెడ్యూలా?

27 Dec, 2019 02:28 IST|Sakshi

ఈసీ షెడ్యూల్‌ను తప్పుపట్టిన టీపీసీసీ కోర్‌ కమిటీ

దీనిపై హైకోర్టుకెళ్తాం.. పొత్తుల అధికారం స్థానిక నాయకత్వాలకే..

సాక్షి, హైదరాబాద్‌: వార్డుల రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారు చేయకుండానే పురపాలిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంపై టీపీసీసీ కోర్‌కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయకుండానే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని తప్పుపట్టింది. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఇందులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌కృష్ణన్, సంపత్‌, వంశీచందర్‌రెడ్డి పాల్గొన్నారు.

కనీసం వారమైనా ఇవ్వాల్సింది..
భేటీలో భాగంగా ఈనెల 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ నిర్వహణ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ, మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేత లు చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించిన నేతలు ఎన్నికల సంఘం తీరును ఆక్షేపించారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వా త అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారు నామినేషన్‌ దాఖలుకు వీలుగా అన్ని పత్రాలు సిద్ధం చేసుకునేందుకు కనీసం వారం సమయం కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఒక్కరోజు మాత్రమే గడువు ఇవ్వడం సరైంది కాదని, దీనిపై హైకో ర్టుకు వెళ్లాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపేయాలని అడగటం లేదని, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తగిన సమయం ఇవ్వాలని మాత్రమే కోర్టును కోరాలని అభిప్రాయపడ్డారు. పార్టీ పరంగా మున్సిపల్‌ ఎన్నికల సమాయత్తంపై కూడా నేతలు చర్చించారు.  స్థానికంగా అవసరమైన స్థానాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తు పెట్టుకునే అధికారం స్థానిక నాయకత్వానికే ఇవ్వాలని కోర్‌కమిటీ నిర్ణయించింది.

డీజీపీని అడిగితే డీసీపీ స్పందిస్తారా?
నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని తాము డీజీపీని కోరితే స్థానిక డీసీపీ స్పందించి ర్యాలీకి అనుమతి లేదనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరసన ర్యాలీ నిర్వహించి తీరాల్సిందేనని కోర్‌కమిటీ నిర్ణయించింది.

వేదిక పంచుకునేది లేదు..
ఇక నిజామాబాద్‌లో యునైటెడ్‌ ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27న ఎన్‌ఆర్సీకి వ్యతిరేకం గా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనడంపై కూడా కోర్‌కమిటీ సమావేశంలో చర్చించా రు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్‌ తనకు ఫోన్‌ చేశారని టీపీసీసీ కోశాధికారి గూడూరు దృష్టికి తెచ్చారు.  బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పాల్గొనే ఏ వేదికను కాంగ్రె స్‌ పంచుకునేది లేదన్నారు. కోర్‌కమిటీ సమావేశం అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి ఈనెల 28న తాము నిర్వహించనున్న నిరసన ర్యాలీకి అనుమతినివ్వాలని కోరారు.

>
మరిన్ని వార్తలు