ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: పొన్నం ప్రభాకర్‌

14 May, 2020 16:28 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జీవో నంబర్‌ 64ను తక్షణమే రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్‌ చేశారు. ఇలాంటి జీవో తెచ్చి ప్రతిపక్షాలను అడ్డుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వం గగ్గోలు పెడుతోందని విమర్శించారు. రైతు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను పరామర్శిస్తే కేసులు నమోదు చేస్తామని  జీవో 64 తీసుకొచ్చారని మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కుల, చేతి వృత్తులకు  ఆర్థిక సాయం అందించిందని, తెలంగాణలో ఎంతమందికి కుల వృత్తుల వారికి సాయం చేశారో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇతర రాష్ట్రాలను చూసైనా సీఎం కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన హితవు పలికారు.

ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కుల ,చేతి వృత్తులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పడం తప్ప..చేసేదేమీ కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు.  రైస్ మిల్లర్లకు సమస్యలు ఉంటే ప్రభుత్వ పెద్దలతో చర్చించుకోవాలి కానీ, రైతులను ఇబ్బందులు పెట్టడం సబబు కాదన్నారు. నల్గొండ జిల్లాలో 100 శాతం కొనుగోళ్లు జరిగితే ఎందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగడం లేదని ప్రశ్నించారు. తాను చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్‌ అనడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్‌ను మాట మీద నిలబడని ఏకైక రాజకీయ వేత్తగా పొన్నం ప్రభాకర్‌ అభివర్ణించారు. ఫ్యూడల్ మనస్తత్వంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు