దారి దీపం!

29 Jun, 2018 10:10 IST|Sakshi
జాబ్‌మేళాలో క్యూ కట్టిన నిరుద్యోగులు

నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం  

వేలాదిమందికి ఉపాధి అవకాశం

జాబ్‌మేళాలతో భవిష్యత్‌కు బాట

ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం కృషి  

నాంపల్లి: ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఆ పూట మాత్రమే వారి కడుపు నిండుతుంది. కానీ ఆ కుటుంబంలో ఏ ఒకరికైనా ఉద్యోగ వస్తే జీవితాంతం సంతోషంగా ఉంటుంది. ఆ పనే చేస్తోంది ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం నిరుద్యోగుల ఉపాధి కల్పించి వారి జీవితాలకు దారి దీపమై నిలుస్తోందీ సంస్థ. ఇప్పటి దాకా సుమారు 159 జాబ్‌ మేళాలతో 19 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. వారిలో 7,200 మంది ఆయా ఉద్యోగాల్లో చేరి మెరుగైన జీవితాన్ని, గౌరవాన్ని పొందుతున్నారు. ఇంత భారీగా నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తున్న ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి ఉచితంగా అందిస్తోంది. దరఖాస్తులకయ్యే ఖర్చు కూడా లేకుండా నిర్వహించడం విశేషం. ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం తన మాతృసంస్థ కుశ్మాన్వి వెబ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సామాజిక బాధ్యతలో భాగంగా మెగా ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ వెంకట్‌ బులెమోని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాలకూ సేవల విస్తరణ 
ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం నిర్వహించే మెగా ఉద్యోగ మేళాలలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 385 కంపెనీలు ట్రేడ్‌ హైదరాబాదు.కాం జాబ్‌ మేళాలలో పాల్గొన్నాయి. ఉద్యోగ మేళాలు పట్టణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాలకు చేరువయ్యాయి. హైదరాబాద్, వరంగల్లు, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, వనపర్తి, నారాయణపేట, ఖమ్మం, కోదాడ, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, జనగాం, వికారాబాద్, షాద్‌నగర్, మేడ్చల్, మంచిర్యాల, కల్వకుర్తి, జడ్చర్ల, కొత్తపేట సహా పలు గ్రామాల్లోనూ గ్రామ పంచాయతీ సహకారంతో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోంది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, బాపట్ల, విశాఖపట్నం, కాకినాడ, చీపురుపల్లి, ప్రకాశం, ఒంగోలు, విజయనగరం,శ్రీకాకుళం, తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, కర్నూలు, చీరాలతో పాటు పలు మండల, గ్రామాల స్థాయిలో ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం ఉద్యోగ మేళాలను నిర్వహిస్తోంది.

ఆత్మ సంతృప్తినిస్తోంది  
నిరుద్యోగులకు ఉద్యోగ మేళాలు కల్పవృక్షాల వంటివి. ఉద్యోగాల కోసం యువత వెతుక్కోకుండా ఉండేందుకు మేళాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల అర్హతలు కలిగిన వారిని ఉద్యోగస్తులను చేస్తున్నాం. ఉద్యోగాలు ఇప్పించడం మాకెంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తోంది. త్వరలో నిరుద్యోగులకు ఉచిత శాశ్వత జాబ్‌ కన్సల్టెన్సీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. కెరీర్‌ మంత్ర పేరుతో ప్రారంభించే ఈ కన్సల్టెన్సీ ఎంతో ఉపయోగపడుతుంది.    – వెంకట్‌ బులెమోని,ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం సీఈఓ 

పాతబస్తీ వాసులకు665 ఉద్యోగాలు..   
ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం సంస్థ సహకారంతో తాము పాతబస్తీలోని కార్వాన్‌లో గత ఏప్రిల్‌ మాసంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించాం. మొత్తం 45 కంపెనీలు పాల్గొన్నాయి. 665 మందికి ఉద్యోగాలు లభించాయి. నిరక్షరాస్యతను దృష్టిలో ఉంచుకుని 7వ తరగతి చదివిన అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించాయి. – పెద్దిగారి సంతోషి,స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు

మరిన్ని వార్తలు