సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు

18 Oct, 2019 09:13 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించేవి. ఆ కళాప్రదర్శనలు చూసేందుకు ఊరంతా ఒకచోటుకే చేరేవారు.  పల్లెల్లో వాటికి ఆదరణ ఉండడంతో భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామయాణాలు వంటి నాటికలు, భాగవత ప్రదర్శనలు జోరుగా ఉండేవి. ఎప్పుడైతే సినిమాలు, టీవీలు అందుబాటులోకి వచ్చాయో ఆనాటి పల్లెకళలు, నాటకాలు, భాగవతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి కళలను ఈనాటి వారికి పుస్తకాల ద్వారానో, టీవీల ద్వారా చూపించే ఈ రోజుల్లో పల్లెకళలు ఇంకా బతికే ఉన్నాయిని చెబుతున్నారు దండేపల్లి మండలానికి చెందిన పలువురు కళాకారులు.

మండలంలోని పలు గ్రామాల నుంచి..
దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, వెల్గనూర్, కొర్విచెల్మ, కొండాపూర్, కాసిపేట, నంబాల, నర్సాపూర్‌ గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వీరంతా భజన బృందాలుగా ఏర్పడి, ఇప్పటికీ పలు పండుగలు, పబ్బాలు, శ్రావణం, కార్తీక మాసాల్లో, మహశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగల రోజుల్లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు గ్రామాల్లో పూజలు జరుపుకునే వారి ఇళ్లలో కూడా రాత్రి వరకు భజనలు చేస్తుంటారు. అంతేకాకుండా కృష్ణాష్టమి, దీపావళీ, శ్రీరామనవమి, శివరాత్రి పండుగలతో పాటు ఇతర పండుగల్లో సందర్భాన్ని బట్టి నాటికలు, భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామాయణం వంటి కళాప్రదర్శనలు నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. వీటిని వీక్షించేందుకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి ఆనాటి కళప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మురిసి పోతున్నారు.

పుణ్య క్షేత్రాల్లో భజనలకు..
గ్రామాల్లో గల భజన బృందాలు సాకాకుండా, తిరుమల, తిరుపతి, దేవస్థానాలు, భద్రాచలం, బాసర, కొండగట్టు, గూడెం, ఆలయల్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రవీంద్రభారతిలో నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. 

అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నం
నేను నేర్చుకున్న నాటికలు, బాగవతాలను ఇప్పటికీ మా గ్రామంలో పలు పండుగ సమయాల్లో ప్రదర్శిస్తుంటాం. దీంతో ఇప్పటి వారికి ఆనాటి కళలను గుర్తు చేసిన వాళ్లం కావడంతో పాటు, పల్లె కళలు ఇంకా బతికే ఉన్నాయని తెలియజేస్తున్నం. మా గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి.
– ముత్యం శంకరయ్య, రెబ్బనపల్లి  

మరిన్ని వార్తలు