తిప్పలుండవ్‌!

19 Dec, 2018 09:09 IST|Sakshi
ఉప్పల్‌ జంక్షన్‌

ఉప్పల్‌లో ట్రాఫిక్‌

సమస్యకు చెక్‌ పెట్టేందుకు నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణం

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించనుంది. వరంగల్‌వైపు నుంచి వచ్చేవారికి నారపల్లి నుంచి ఉప్పల్‌ జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను జాతీయ రహదారుల సంస్థ నిర్మించనుండగా, ఉప్పల్‌ జంక్షన్‌ వద్ల నలువైపులా మార్గాల్లో ప్రయాణించేవారి కోసం అనువుగా నాలుగు ఫ్లై ఓవర్లను జీహెచ్‌ఎంసీ నిర్మించనుంది. జాతీయ రహదారుల సంస్థ ఉప్పల్‌ శ్మశానవాటిక వరకు మాత్రమే ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించనుండగా, దానిని రామంతాపూర్‌ వరకు పొడిగిస్తూ అదనపు నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఈ ఫ్లై ఓవర్‌ మెట్రోరైలు మార్గంపైన భూమికి 20 మీటర్ల ఎత్తున రానుంది.

1220 మీటర్ల  పొడవుండే ఇది రామంతాపూర్‌లో ఉప్పల్‌ స్టేడియం రోడ్‌కు కాస్త ముందుగా  చర్చివైపు  దిగుతుంది. అక్కడి నుంచి స్టేడియం రోడ్‌వైపు వెళ్లే వారికోసం రోడ్డుకు ఈ వైపు నుంచి ఆవైపు మరో చిన్న ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తారు. దీంతో ఉప్పల్‌ జంక్షన్‌ వద్ద ఉప్పల్‌ నుంచి రామంతాపూర్‌ మార్గాల మధ్య ప్రయాణించేవారికి సాఫీ ప్రయాణంసాధ్యమవుతుంది. దీంతో పాటు నాగోల్‌– తార్నాకల మధ్య ప్రయాణించే వారి కోసం ఉప్పల్‌ జంక్షన్‌ వద్ద మూడేసి లేన్లతో మరో రెండు ఫ్లై ఓవర్లు మెట్రోకు సమాంతరంగా రెండువైపులా నిర్మాణం చేయనున్నారు. వీటి పొడవు దాదాపు 900 మీటర్లు. ఈ నాలుగు ఫ్లై ఓవర్లతో ఉప్పల్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ చిక్కుల సమస్య పరిష్కారం కానుందని భావిస్తున్నారు. వీటి అంచనా వ్యయం రూ. 310 కోట్లు. వీటికి ప్రభుత్వ అనుమతి కూడా లభించడంతో ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం త్వరలో టెండర్లు పిలిచే యోచనలో జీహెచ్‌ఎంసీ అధికారులున్నారు. 

భూసేకరణ..
ఫ్లై ఓవర్ల నిర్హాణం కోసం సర్వే ఆఫ్‌ ఇండియా, ప్రభుత్వ భూములు 5.4 ఎకరాలతోపాటు 1.69 ఎకరాల ప్రైవేట్‌ భూములు సేకరించాల్సి ఉంది. మరో నాలుగు ప్రైవేట్‌ ఆస్తులు సేకరించాలి. 

సాఫీప్రయాణం..
ప్రస్తుతం  వరంగల్‌ నుంచి ఉప్పల్‌ జంక్షన్‌కు రావడానికి దాదాపు రెండు గంటల సమయం పడితే అక్కడినుంచి నగరంలోకి రావడానికి గంట సమయం పడుతోంది.  ఉప్పల్‌ జంక్షన్‌ వద్ద రద్దీసమయంలో గంటకు  దాదాపు 20 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి.  ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వివిధ అభివృద్ధి, వ్యాపార కార్యక్రమాలతో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సిగ్నల్‌ ఫ్రీతో   ఎంతో ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ రావడానికి ట్రాఫిక్‌ రద్దీతో  దాదాపు గంట సమయం పడుతుండగా, కారిడార్‌ పూర్తయితే పదినిమిషాలు చాలు. అలాగే అంబర్‌పేటకు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. తద్వారా వరంగల్, యాదగిరిగి గుట్ట వైపు నుంచి నగరంలోకి వచ్చేవారికి, వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

చే నెంబర్‌ జంక్షన్‌లో...
ఈ ఫ్లై ఓవర్లతో పాటు అంబర్‌పేట చేనెంబర్‌  జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి మరో ఫ్లై ఓవర్‌ నిర్మించనున్నారు. అంబర్‌పేట ముకరం హోటల్‌ నుంచి గోల్నాక సలీమ్‌ బ్రిడ్జి చర్చి వరకు నిర్మించే దీని వల్ల గోల్నాక, అంబర్‌పేటల నుంచి ఘట్‌కేసర్‌ వరకు, అట్నుంచి ఇటు ఎలాంటి ట్రాఫి క్‌ జంజాటాల్లేకుండా ప్రయాణం సాగించవచ్చు. 

అంబర్‌పేట (చే నెంబర్‌ ఫ్లై ఓవర్‌)  
అంచనా వ్యయం: రూ.467.55 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.226.88 కోట్లు కాగా, మిగతా రూ.240.07 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఫ్లై ఓవర్‌ పొడవు 1.60 కి.మీ.లు, వెడల్పు18 మీటర్లు
సేకరించాల్సిన ఆస్తులు 281
సేకరించాల్సిన భూమి 4.63 ఎకరాలు.  
ప్రాజెక్టులో భూసేకరణకే రూ. 317 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో రూ.76.33 కోట్లు కేంద్రం అందిస్తుండగా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ భరిస్తున్నాయి.  
ఫ్లై ఓవర్‌ నిర్మాణ వ్యయం: రూ.150.55 కోట్లు.

మరిన్ని వార్తలు