తడిసి.. ట్రాఫిక్‌లో ముద్దయ్యారు! 

22 Jun, 2019 02:37 IST|Sakshi
ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిన మెట్రో స్టేషన్‌

తొలకరితో నగరంలో ట్రాఫిక్‌ జామ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మండుటెండలు, తీవ్ర వడగాడ్పులతో సతమతమైన సిటీజనులు తొలకరి వానను చూసి మురిసిపోయేలోగా.. ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులపై వరదనీరు పోటెత్తింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇళ్లకు బయలుదేరినవారు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు.

మాదాపూర్‌ నుంచి కూకట్‌పల్లి, మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం మార్గాల్లో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. బస్సులు, ప్రైవేటు వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించారు. అటు మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. అదనపు రైళ్లను నడిపినా రద్దీని నియంత్రించలేకపోయామని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి 11.45 గంటల వరకు మెట్రో రాకపోకలను పొడిగించారు.  

>
మరిన్ని వార్తలు