బ్రీత్‌ ఎనలైజర్లతో బేఫికర్‌!

3 Feb, 2020 08:01 IST|Sakshi

వీటి ద్వారా గాలి వెనక్కు పీల్చలేమని స్పష్టీకరణ

కరోనా వైరస్‌ భయం నేపథ్యంలో ట్రాఫిక్‌ కాప్స్‌ వివరణ

సాక్షి, సిటీబ్యూరో:  కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు మందుబాబులకు నిర్వహించే శ్వాస పరీక్షలపై కొన్ని వదంతులు చెలరేగుతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ పరీక్షల్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే డ్రంక్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌లోనూ వాహనచోదకుల నుంచి ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్‌ కాప్స్‌ బ్రీత్‌ ఎనలైజర్లతో ఎలాంటి భయం లేదని హామీ ఇస్తున్నాయి. ఐఎస్‌ఐ గుర్తింపులతో కూడిన ఈ యంత్రాలు సాంకేతికంగా ఆధునిక పరిజ్ఞానంతో   రూపొందాయని స్పష్టం చేస్తున్నారు. నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు వినియోగిస్తున్న బ్రీత్‌ ఎనలైజర్లు ‘వన్‌ వే మౌత్‌ పీస్‌ విత్‌ నాన్‌ రిటర్నింగ్‌ వాల్‌’ పరిజ్ఞానంతో తయారు చేసినవి అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వీటితో పరీక్షిస్తే ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్, ఇన్‌ఫెక్షన్స్‌ వ్యాప్తి ఉండదని చెప్తున్నారు. వాహనచోదకుల్ని తనిఖీ చేస్తున్న సందర్భంలో ఈ బ్రీత్‌ ఎనలైజర్‌ను తొలుత నేరుగా వారి నోటికి సమీపంలో  పెడుతున్న ట్రాఫిక్‌ పోలీసులు ఊదమని చెప్తున్నారు. మద్యం తాగినట్లు సంకేతాలు వస్తే... అప్పుడు ఆ యంత్రానికి స్ట్రాపైపు తగిలించి మరోసారి ఊదించి బడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కొక్కరికీ ఒక్కో స్ట్రా వాడుతామని, ఒకసారి వినియోగించింది మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ మిషన్‌కు తగిలించమని స్పష్టం చేస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌లోకి నేరుగా ఊదినప్పుడు గాలి దాని ద్వారా వెళ్ళిపోతుందని...మరోవ్యక్తో, లేక ఆ వ్యక్తో ఎనలైజర్‌ ద్వారా గాలి పీల్చాలని చూసినా సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అందులో ఉండే నాన్‌ రిటర్నింగ్‌ వాల్‌ గాలి వెనక్కు రాకుండా అడ్డుకుంటుందని, ఈ నేపథ్యంలోనే ఎనలైజర్‌ ద్వారా గాలి, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌ పీల్చిన వ్యక్తి నోటిలోకి వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. గతంలో సిటీలో స్వైన్‌çఫ్లూ చాయలు కనిపించినప్పుడు ఇలాంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని, అప్పట్లో బ్రీత్‌ ఎనలైజర్లు సరఫరా చేసిన సంస్థను సంప్రదించి అన్ని సందేహాలు నివృతి చేసుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు