చలాన్‌తోనే సరిపెడుతున్నారు..

26 Aug, 2019 10:09 IST|Sakshi

నో–ఎంట్రీ వాహనాలపై కఠిన చర్యలకు ఇబ్బందులు

సీజ్‌ చేసే అవకాశం ఉన్నా ఇక్కట్లు ఎన్నో

జరిమానాలతో సరిపెడుతున్న పోలీసులు

అతిక్రమిస్తున్న వాటిలో డీసీఎంలే అధికం

సాక్షి,సిటీబ్యూరో: అనుమతి లేని సమయంలో నగరంలోని రహదారుల పైకి దూసుకువస్తున్న భారీ వాహనాలు, డీసీఎంల కారణంగా 10 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇలా వస్తున్న వాహనాలకు చలాన్‌ విధించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటి కారణంగానే ఆయా వాహనాలను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదన్నారు. అనుమతి పొందిన వాటి మినహా నగరంలో భారీ వాహనాలు, లారీలు, డీసీఎంల ప్రవేశంపై ఆంక్షలు ఉన్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలోనే ఇవి నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అయినా ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తున్న నిర్వాహకులు, డ్రైవర్లు ఎప్పుడుపడితే అప్పుడు దూసుకొచ్చేస్తున్నారు. ఈ ఉల్లంఘనపై ‘నో–ఎంట్రీ’ కేసులు రాస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తున్నారు. ఏటా 30 వేల నుంచి 50 వేల వరకు ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఆయా వాహనాల డ్రైవర్లు కూడా  అనుమతి లేని వేళల్లో నగరంలోని ప్రవేశించి ఓసారి చలాన్‌ వేయించుకుంటున్నారు. దీనిని చూపిస్తూ ఆ రోజంతా సిటీలో స్వైర విహారం చేస్తున్నారు. ఇలాంటి వాహనాలకు ప్రతి జంక్షన్‌లోనూ జరిమానా విధించే అవకాశం ఉన్నా.. మానవతా దృక్పథంతో పోలీసులు అలా చేయట్లేదు. మరోపక్క ఇలాంటి ‘నో–ఎంట్రీ వాహనాలను’ స్వాధీనం చేసుకునే ఆస్కారం సైతం పోలీసులకు ఉంది.

అయితే దీని వెనుక పెద్ద ప్రహసనమే ఉంటోంది. రహదారిలో ఓ ప్రాంతంలో ఇలాంటి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడే ఉంచడం సాధ్యం కాదు. దాని డ్రైవర్‌ను పంపేసినా మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్, లేదా గోషామహల్‌ స్టేడియానికి తరలించాలి. అనంతరం సదరు డ్రైవర్‌/యజమాని జరిమానా చెల్లించి వచ్చి తీసుకువెళ్ళే వరకు దాన్ని భద్రపరచాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మించి అనుమతి లేని సమయంలో వచ్చిన భారీ వాహనంలో నిత్యావసర, అత్యవసర, సున్నిత వస్తువులు ఉంటే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ ఆయా వాహనాల డ్రైవర్లకు కలిసి వస్తుండటంతో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇలా నో–ఎంట్రీ సమయంలో వస్తున్న భారీ వాహనాల్లో డీసీఎంలే ఎక్కువ... ప్రమాదాల్లోనూ వీటిది పెద్ద స్థానమే. మరోపక్క రాత్రి అయిందంటే చాలు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సులతో నిండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా నడిచే ఈ వాహనాలు, అడ్డగోలుగా పార్కింగ్స్, భయానకమైన శబ్ధాలు చేసే హారన్లు తోటి వాహనచోదకులతో పాటు నగరవాసులకూ నరకాన్ని చూపిస్తున్నాయి. రాత్రి 10 గంటల లోపు ప్రైవేట్‌ బస్సులు సిటీలోకి రావడానికి అనుమతి లేదు. అలాగే రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు నిబంధనలు బేఖాతరు చేయడం, అడ్డదిడ్డంగా డ్రైవ్‌ చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా పార్కింగ్‌ చేయడం పరిపాటిగా మారింది. వీటి సమస్య తీరాలంటే ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దింపడానికి ఈ వాహనాల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసుస్టేషన్ల వారీగా గుర్తించి ఏర్పాట్లు చేస్తేనే ఈ బస్సుల హడావుడికి చెక్‌ చెప్పవచ్చు. 

మరిన్ని వార్తలు