ప్లేటు మారిస్తే.. ఫేట్‌ మారిపోద్ది!

13 Aug, 2019 03:19 IST|Sakshi

విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న ట్రాఫిక్‌ పోలీసులు 

చలాన్‌లతో సరిపెట్టకుండా క్రిమినల్‌ కేసులూ నమోదు

సాక్షి, హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల చెక్‌పోస్టు ప్రాంతంలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఆపారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న దాని నంబర్‌ ప్లేట్‌ అత్యంత చిత్రంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జరిమానా విధించారు. ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌గా పిలిచే ఈ ఉల్లంఘనతో పాటు అనేక రకాలైన వైలేషన్స్‌కు పాల్పడుతున్న వాళ్లు సిటీలో ఉన్నారు. తమ వాహనాల నంబర్‌ ప్లేట్లను వంచేస్తూ... కొంత మేర విరగ్గొట్టేస్తున్న... కొన్ని అంకెల్ని చెరిపేస్తూ ‘దూసుకుపోతున్నారు’. ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా ఈ–చలాన్‌ పడకుండా ఉండేందుకు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. వీరికి జరిమానాలతో సరిపెడుతున్న ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీవ్రమైన ట్యాంపరింగ్‌ విషయంలో మాత్రం సీరియస్‌గా ఉంటున్నారు. తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు.
 
నిబంధనలు, సూచనలు ఇవే..

  • బైక్‌లు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్‌ ఉండాలి.
  • కమర్షియల్, గూడ్స్‌ వాహనాలకు పసుపు రం గు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్‌ ఉండాలి. 
  • నంబర్‌ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు  నిషేధం.
  • బోగస్‌ నంబర్‌ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్‌ కేసులు నమోదుతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు చర్యలు.
  • వాహనచోదకులు ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టీఏ యాప్‌లో కలిగి ఉండాలి.
  • ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ 500X120, తేలికపాటి, ప్యాసింజర్‌ వాహనాలు 340X200  లేదా 500X120 మిల్లీ మీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్‌ వాహనాలకు 340X200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి.

 రాజధానిలోనే అధికం.. 
వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్ల విష యంలో ట్రాఫిక్‌ పోలీసులు సీరియస్‌ గా ఉంటున్నారు. రాష్ట్రంలో నంబర్‌ప్లేట్లు లేని వాహనాలపై జనవరి నుంచి జూన్‌ వరకు 1,28,621, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనే 1,06,692 కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు