వేడుకున్నా వదల్లే..

19 Jul, 2019 09:00 IST|Sakshi
సీఐ సత్యనారాయణ కాళ్లపై పడి వేడుకుంటున్న అమర్‌సింగ్‌ ,ఎస్‌ఐ రమేష్‌ను వేడుకుంటూ..

ట్రాఫిక్‌ పోలీసులకు చేతులెత్తి మొక్కుతూ.. కాళ్లావేళ్లా పడుతున్న ఈ పెద్దాయన పేరు అమర్‌సింగ్‌(55). మధ్యప్రదేశ్‌కు చెందిన ఈయన అక్కడ ఉపాధి లేక బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి చింతల్‌ హెచ్‌ఎంటీ ప్రధాన రోడ్డులో చిన్న షెడ్డు వేసుకుని రగ్గులు, దుప్పట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం జీడిమెట్ల ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ అధికారులు సంయుక్తంగా ఇక్కడ ఆక్రమణల తొలగింపు చేపట్టారు.

పోలీసులను బతిమిలాడుతున్న అమర్‌సింగ్‌
ఈక్రమంలో రోడ్డు పక్కనున్న అమర్‌సింగ్‌ షెడ్డును కూడా తొలగిస్తుండగా.. తన బతుకు నాశనం చేయొద్దంటూ అక్కడున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమేష్‌సింగ్‌ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఆయన పట్టించుకోకపోవడంతో అక్కడికి వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ కాళ్లపై కూడా పడ్డాడు. అయినా అధికారులు కనికరం చూపకుండా అమర్‌సింగ్‌ షెడ్డును తొలగించి, సామగ్రిని జప్తు చేశారు. దాంతో బాధితుడు కన్నీళ్లు పెట్టుకోవడం మినహా మరేం చేయలేకపోయాడు. ఇతడి లాగే మరికొందరు బడుగుల బతుకును అధికారులు కూల్చివేశారు. బడాబాబుల ఆక్రమణలపై కన్నెత్తి చూడలేని అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి చిరుజీవులపై ప్రతాపం చూపుతున్నారని అక్కడి పరిస్థితిని గమనించిన కొందరు చెప్పుకోడం గమనార్హం.  

మరిన్ని వార్తలు