సేఫ్‌ జర్నీ

10 Aug, 2018 08:45 IST|Sakshi

ఆటోల్లో అతివల భద్రతపై నజర్‌

క్యాబ్‌ల తరహాలోనే క్యూఆర్‌ కోడ్, బార్‌ కోడ్‌ నంబర్‌ ప్లేట్లు   

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రాచకొండ పోలీసుల ఆదేశం

నంబర్‌ ప్లేట్‌ స్కాన్‌ చేస్తే చాలు

సాక్షి, సిటీబ్యూరో: ఆటోల్లో ప్రయాణం చేసే వారు ముఖ్యంగా మహిళల భద్రతపై రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ఐటీ మహిళా ఉద్యోగుల భద్రత కోసం క్యాబ్‌ డ్రైవర్లకు క్యూఆర్‌ కోడ్‌/బార్‌ కోడ్‌ నంబర్‌ ప్లేట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగానే ఆటో డ్రైవర్లకు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఆటోల్లో ప్రయాణించే మహిళలు భద్రంగా ఇంటికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది. రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు అమలు చేస్తున్న ఈ విధానం తో ఆటోడ్రైవర్లు కూడా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే అవకాశముంది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఆటోల యజమానులు, డ్రైవర్ల వివరాలను కుషాయిగూడ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్, భగత్‌ సింగ్‌ నగర్‌ కాలనీలోని మహిళ ఠాణాలో నమోదు చేయించుకోవాలని రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ కె.రమేశ్‌ నాయుడు గురువారం పేర్కొన్నారు. 

రెండేళ్ల క్రితమే..
ఐటీ కారిడార్‌లో ఐటీ కంపెనీలు రావడంతో అందుకు తగ్గట్లుగానే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అంచనా వేసిన సైబరాబాద్‌ పోలీసులు ఉద్యోగుల భద్రత, ముఖ్యంగా మహిళల సేఫ్టీపై సమాలోచనలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ క్యాబ్‌ డ్రైవర్లకు క్యూఆర్‌ కోడ్, బార్‌ కోడ్‌ నంబర్‌ ప్లేట్ల రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. ఇదే విధానాన్ని  కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోనూ అమలు చేస్తున్నారు. ‘డ్రైవర్లు వారి పూర్తి వివరాలు ఇస్తే క్యూఆర్‌ కోడ్, బార్‌కోడ్‌ నంబర్‌ ప్లేట్లను పోలీసులు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తారు. ఆయా క్యాబ్‌లలో ఎక్కిన ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌తో క్యూఆర్‌కోడ్‌/బార్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే ఆ కారు వివరాలు, డ్రైవర్, యజమాని ఎవరనే వివరాలు తెలిసిపోతాయి. సమయంతో సంబంధం లేకుండా ఉద్యోగరీత్యా ప్రయాణం చేసే మహిళల కోసం తీసుకొచ్చిన ఈ విధానాన్ని రాచకొండ పోలీసులు ఇప్పుడూ ఆటోవాలాలకు కూడా  వర్తింపజేస్తున్నారు. స్కాన్‌ వివరాలు ప్రయాణికులు తమ కుటుంబసభ్యులకు పంపిస్తే నిశ్చితంగా ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. 

వ్యవహార శైలిలోనూ మార్పు..
ఈ విధానం ఆటోవాలాల వ్యవహర శైలిలోనూ మార్పును తేనుంది. ఇప్పటివరకు ప్రయాణికులతో ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్న కొందరు ఆటోవాలాల జోరుకు బ్రేక్‌పడే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో మహిళలను ఆటోలో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యంగా వ్యవహరించిన సంఘటనలు ఉండటంతో మహిళల భద్రతకు భరోసా కల్పించేందుకు ఈ విధానాన్ని ఎన్నుకున్నారు. దీనివల్ల నేరాలు జరిగినా కేసులను వెంటనే ఛేదించే అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు