మూడు దాటితే మోతే..!

7 May, 2018 11:22 IST|Sakshi

నగరంలో పెరిగిపోతున్న పెండింగ్‌ ట్రాఫిక్‌ ఈ–చలాన్లు

నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పెరిగిన పెండెన్సీ 

మూడేళ్లు.. 32.57 లక్షల చలాన్లు! 

ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్

సాక్షి, హైదరాబాద్‌: నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. 2015–17 మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 34,03 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆ మూడేళ్ల కాలంలో మొత్తం 95.71 లక్షల చలాన్లు జారీ కాగా... వీటిలో 32.57 లక్షల చలాన్లకు సంబంధించిన జరినామాను వాహనచోదకులు చెల్లించలేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనులపై ‘సాంకేతిక’ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మరోపక్క మూడు చలాన్లకు మించి పెండింగ్‌లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ హెచ్చరించారు.  

నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌... 
గతంలో ట్రాఫిక్‌ పోలీసులు రహదారులపై ట్రాఫిక్‌ నిర్వహణను కూడా పక్కన పెట్టి జరిమానాలు విధించడం, వసూలు చేయడంపై దృష్టి పెట్టేవారు. నేరుగా వాహనచోదకుడితో సంబంధం ఉండి ఇలా ఈ–చలాన్లు జారీ చేయడాన్ని కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అంటారు. అయితే ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్‌–కాంటాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్‌ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్‌ నుంచి ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు.  

ఆర్టీఏలో పక్కాగా లేని చిరునామాలు.. 
ఈ ఈ–చలాన్లను ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం  చేసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు తమ కంప్యూటర్‌లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్‌ ఎంటర్‌ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్‌ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్‌ ఆ చిరునామాతో ఈ–చలాన్‌ జారీ చేస్తుంది. దీనిని పోస్టు ద్వారా బట్వాడా చేయిస్తారు. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్‌డేట్‌ కాలేదు. వాహనం ఖరీదు చేసినప్పుడు దాని యజమాని ఉన్న చిరునామానే రిజిస్ట్రేషన్‌ సమయంలో రికార్డుల్లో పొందుçపరుస్తున్నారు. ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నా ఆర్టీఏ రికార్డుల్లో పాత చిరునామానే కొనసాగుతోంది. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్‌ జారీ అయిందనే విషయం దాని యజమానికి తెలియట్లేదు. 

తెలిసిన వారూ చెల్లించట్లేదు... 
ఓ పక్క ఓ వాహనంపై జారీ అయిన ఈ–చలాన్లు దాని యజమానికి చేరని కారణంగా చెల్లించని వారు కొందరైతే... మరికొందరు తెలిసీ పట్టించుకోవడం లేదని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు. గతంలో మెగా లోక్‌ అదాలత్‌లు నిర్వహించిన ప్రతిసారీ ట్రాఫిక్‌ పోలీసులు భారీగా ప్రచారం నిర్వహించడమేగాక 50 శాతం వరకు రాయితీలు ప్రకటించేవారు. దీంతో పలువురు వాహనచోదకులు లోక్‌ అదాలత్‌ జరిగినప్పుడే చెల్లిద్దామనే ఉద్దేశంతో ఉండిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్‌ అధికారులు గత ఏడాది నుంచి ఈ అదాలత్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ విషయంపై ప్రజలకు పూర్తి అవగాహన లేకపోవడంతో కొంత వరకు చెల్లింపులు ఆగుతున్నాయి. బయటి రాష్ట్రా లు, జిల్లాలకు చెందిన వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. అప్పుడప్పుడో, కేవలం ఒకసారి మాత్రమే వచ్చిపోయే ఈ వాహనచోదకులకు ఈ చలాన్లు అందట్లేదు.. అందినా వారు పట్టించుకోవట్లేదు.  

భారీగా పెరిగిపోయిన పెండెన్సీ.. 
ఈ నేపథ్యంలో ఈ–చలాన్లు పెండెన్సీ భారీగా పెరిగిపోయింది. 2015–17 మధ్య నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు 101 ఉల్లంఘనలకు సంబ ంధించి వాహనచోదకులకు 95,71,466 చలాన్లు జారీ చేశారు. ఈ–సేవ, మీ–సేవ, కాంపౌండింగ్‌ బూత్, ఆన్‌లైన్, నిర్దేశిత బ్యాంకుల ద్వారా ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించే ఆస్కారం కల్పించినా ఉల్లంఘనులు 63,13,656 చలాన్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన 32,57,810 చలాన్లు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికే స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు భారీ మొత్తం పెండింగ్‌లో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాహనచోదకుల కోసం ప్రత్యేకంగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) విధానంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నగర ట్రాఫిక్‌ విభా గం అధికారులు భావిస్తున్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఇది సేవలు అందించనుంది. దీనికి కేటాయించే ప్రత్యేక నెంబర్‌కు ఫోన్‌ చేసే వాహనచోదకుడు తమ భాషను ఎంచు కుని, వాహనం రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు... దానిపై పెండింగ్‌లో ఉన్న చలాన్లు, ఎంత మొత్తం అనే వివరాలు కంప్యూటరే వివరించనుంది. 

కఠిన చర్యలు తీసుకుంటాం
పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.  క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలో ఉండే పీడీఏ మిషన్లతో అనునిత్యం వాహనాలను ఆపి పెండింగ్‌ చలాన్లు ఉన్నాయా? అనేది తనిఖీ చేస్తున్నారు. మూడు చలాన్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారు చిక్కితే వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకుని జరిమానా చెల్లించి వచ్చిన తర్వాత ఇస్తున్నాం. అలానే పది కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నాం. ఈ ఉల్లంఘనులకు న్యాయస్థానాలు భారీ జరిమానా విధిస్తున్నాయి. 
– అనిల్‌కుమార్, అదనపు సీపీ (ట్రాఫిక్‌)   

మరిన్ని వార్తలు