ఇక డ్రైవరే టార్గెట్‌

29 Mar, 2018 04:02 IST|Sakshi

వాహనచోదకుడి ఆధారంగానే ఉల్లంఘనల నమోదు

కొత్త ప్రక్రియకు ట్రాఫిక్‌ పోలీసుల శ్రీకారం 

పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే 

వారిని గుర్తించడానికే తప్పుడు ‘నంబర్ల’కు చెక్‌ చెప్పేందుకు ఓటీపీ విధానం

సాక్షి, హైదరాబాద్‌: రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడే వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనం నంబర్‌ ఆధారంగా జరిమానా విధిస్తున్నారు. దీంతో పదేపదే చిక్కుతున్న వాహనాల డేటాబేస్‌ మాత్రమే రూపొందుతోంది. అసలు తప్పు వాటిని డ్రైవ్‌ చేసిన వ్యక్తులదని తెలిసినా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించడం సాధ్యం కావట్లేదు. దీంతో ఎన్నిసార్లు ఉల్లంఘనలకు పాల్పడినా ఒకే తరహాలో జరిమానా విధిస్తున్నారు. ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌’లో అనుసరిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఉల్లంఘనల నమోదును డ్రైవర్‌ ఆధారంగా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల అమలవుతున్న ఈ విధానం త్వరలో నగరవ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని ఆధారంగా రూపొందే డేటాబేస్‌ ద్వారా తరచూ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం, ఆర్టీఏ, న్యాయస్థానాల సహకారంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 

నంబర్‌ ‘మార్చకుండా’ఓటీపీ.. 
నగరంలో పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య భారీగానే ఉంటోంది. ఆయా వాహనచోదకులకు పోలీసులు ఎస్సెమ్మెస్‌ల రూపంలో రిమైండర్స్‌ పంపుతున్నారు. దీనికి అవసరమైన ఫోన్‌ నంబర్లను వాహనం రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీఏ అధికారులకు ఇచ్చింది తీసుకుంటున్నారు. అయితే ఆయా వాహనాలు చేతులు మారిపోవడం, అసలు యజమాని దగ్గరే ఉన్నా అతను ఫోన్‌ నంబర్లు మార్చేయడంతో ఈ సమాచారం వారికి చేరట్లేదు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఉల్లంఘనలను డ్రైవర్‌ కేంద్రంగా నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫోన్‌ నంబర్లనూ తీసుకోనున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు కోరినప్పుడు ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగానో, అనివార్య కారణాలతోనో తప్పు నంబర్లు చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్‌ నంబర్ల సేకరణలో వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) విధానం అమలు చేయనున్నారు. ఉల్లంఘనుడు తన ఫోన్‌ నంబర్‌ చెప్పిన వెంటనే అధికారులు పీడీఏ మిషన్‌లో నమోదు చేస్తారు. వెంటనే పీడీఏలు కనెక్ట్‌ అయి ఉండే సర్వర్‌ నుంచి సదరు నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఉల్లంఘనుడు చెప్తేనే అసలు నంబర్‌ చెప్పినట్లు నిర్ధారిస్తారు. ఈ విధానంతో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించడం తేలికవుతుందని ట్రాఫిక్‌ అధికారులు చెప్తున్నారు. అలా రూపొందే డేటాబేస్‌ ఆధారంగా ఆర్టీఏ ద్వారా లైసెన్స్‌ సస్పెండ్‌ చేయించడం, కొన్ని రకాలైన ఉల్లంఘనుల్ని కోర్టు ద్వారా జైలుకు తరలించడం తదితర కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.  

పీడీఏ మిషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు చలాన్ల పుస్తకాలను వాడట్లేదు. ఉల్లంఘనులకు జరిమానా విధించడం, వారి నుంచి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల ద్వారా ఆ మొత్తాన్ని వసూలు చేయడం తదితరాలన్నీ పీడీఏ మిషన్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. తాజాగా తీసుకున్న ‘డ్రైవర్‌’నిర్ణయంతో ఈ పీడీఏ మిషన్లలో కొన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాహనచోదకుడి వద్ద ఒరిజినల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే దాన్ని రీడ్‌ చేసే పరిజ్ఞానం జోడించారు. ఉల్లంఘనుడి వద్ద ఉన్నది జిరాక్సు ప్రతి అయితే ఆ వివరాలు మాన్యువల్‌గా ఫీడ్‌ చేయనున్నారు. ప్రతి ఉల్లంఘనుడు తన డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు మరో గుర్తింపు కార్డును చూపడం కచ్చితం చేయనున్నారు. ఆధార్‌ కార్డ్, ఓటర్‌ ఐడీ తదితరాల్లో ఏదో ఒకటి అదనంగా చూపించాల్సిన విధానం అమలులోకి తీసుకువస్తున్నారు. ఈ వివరాలనూ పీడీఏ మిషన్లలో ఫీడ్‌ చేయడం ద్వారా ఉల్లంఘనులకు సంబంధించిన డేటాబేస్‌ రూపొందించనున్నారు. 

మరిన్ని వార్తలు