బండెక్కితే బాదుడే..!

14 Nov, 2018 14:13 IST|Sakshi

అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్‌తో వాహనదారుల అవస్థలు 

ఈ–చలానా అంటూ జేబులు గుల్ల చేస్తున్నా సిబ్బంది

అవగాహన లేకుండా  ఫొటోలు తీస్తున్న పరిస్థితి 

పార్కింగ్‌ సమస్యను  గాలికొదిలిన వైనం  

ఖమ్మంక్రైం: సిగ్నల్స్‌ వద్ద మార్కింగ్‌ లేకపోవడం.. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందుకు స్థలం లేకపోవడం.. వాహనదారులు, ప్రయాణికులు ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళం. నిత్యం వేలాది వాహనాలు నగరంలోకి వచ్చిపోతుండడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లలో మరీ దారుణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్‌ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు.  
నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు.

 ఒకటో సెక్టార్‌ గాంధీ చౌక్‌ నుంచి త్రీటౌన్‌ ప్రాంతం, రెండో సెక్టార్‌ వన్‌టౌన్‌ పరిధిలోని స్టేషన్‌ రోడ్‌ నుంచి, మూడో సెక్టార్‌ వైరారోడ్‌ నుంచి జెడ్పీసెంటర్‌ వరకు, నాలుగో సెక్టార్‌ జెడ్పీసెంటర్‌ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఐదో సెక్టార్‌ ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి బైపాస్‌ రోడ్డు వరకు విభజించారు. వీటిలో ప్రధాన కూడళ్లు అయిన గాంధీచౌక్, కాల్వొడ్డు, వైరా రోడ్, కిన్నెర పాయింట్, మయూరి సెంటర్‌ ప్రాంతాల్లో నిత్యం వాహనదారులు, పాదచారులు నరకం చూడాల్సిందే. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు.

 కస్బాబజార్‌లో పలు వస్త్ర దుకాణాల వద్ద, అజీజ్‌ గల్లీ ప్రాంతంలో సైతం ఇదే సమస్య. ముఖ్యంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కిన్నెర పాయింట్, కమల మెడికల్‌ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడి పాయింట్‌లో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుళ్లు ఉండడం లేదని, దీంతో ట్రాఫిక్‌ సమస్య ఆ ప్రాంతంలో మరింత తీవ్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాయింట్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాలి. కానీ.. ప్రధాన పాయింట్ల వద్ద సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 మంది ట్రాఫిక్‌ సిబ్బంది ఉండగా.. అందులో 20 మంది వరకు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  
భయభ్రాంతులకు గురిచేస్తున్న సిబ్బంది 
ఇటీవల కాలంలో ఈ–చలానా, క్యాష్‌లెస్‌ లావాదేవీల పేరుతో హైదరాబాద్‌ స్థాయిలో ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారు చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినప్పటికీ ఖమ్మం వంటి నగరంలో దీనిపై 90 శాతం మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ విధానాన్ని ఇక్కడ ప్రారంభించిన మొదటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి తప్ప దీనిపై వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు ఎటువంటి అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. కొందరు సిబ్బందికి డిజిటల్‌ కెమెరాలు ఇచ్చి విధి నిర్వహణకు పంపిస్తుండడం.. వారు ఒక్కసారిగా రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ఫొటోలు తీయడంతో ఏమీ అర్థంకాక వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అసలు ఫొటోలు తీస్తున్న సిబ్బందికి కూడా ఈ ఫొటోలు ఎందుకు తీయాలి.. ఈ–చలానా అంటే ఏమిటో కూడా సరిగా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను అతిక్రమించడం, హెల్మెట్‌ ధరించకపోవడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటిని ట్రాఫిక్‌ పోలీసులు ఫొటోలు తీసి.. నేరుగా వాహనదారుడి సెల్‌కు జరిమానా ఎంత కట్టాలి అనే దానిపై మెసేజ్‌ పంపిస్తారు.
  
పార్కింగ్‌ ఏర్పాటు గాలికి..
 
హైదరాబాద్‌ స్థాయిలో ఈ–చలానా ప్రవేశపెట్టిన పోలీసులు.. హైదరాబాద్‌ స్థాయిలో కాకుండా కనీసం ఖమ్మం కమిషనరేట్‌ స్థాయిలో వాహనాల పార్కింగ్‌ కోసం ఏళ్లు గడిచినా సరైన స్థలం చూపించలేదు. నిత్యం నగరానికి సుమారు 1.50 లక్షల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటిలో 20వేలకు పైగా ఆటోలు ఉండగా.. మిగతావి ఇతర వాహనాలు ఉన్నాయి. ఆటోలకు అడ్డాలు లేకపోవడంతో నిత్యం రోడ్లపైనే వాటిని నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రికి.. వ్యాపార సముదాయాలకు వెళ్లాలనుకున్నా.. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియక సతమతమవు తున్నారు. ఇంత జరుగుతున్నా పార్కింగ్‌ స్థలాల గురిం చి ట్రాఫిక్‌ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.
  
వాహనదారులకు వివరించాలి.. 
అలాగే ఈ–చలానాపై వాహనదారులకు అవగాహన కల్పించడం ఎంతోముఖ్యం. ఈ–చలానా అంటే ఏమి టి? ఎందుకు ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తారు? అనే దానిపై తమకు కూడా అవగాహన కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఆ తర్వాతే దీనిని పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుం టుందని వాహనదారులు, ప్రజలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు