డేగకన్ను

14 Aug, 2019 13:13 IST|Sakshi

పంద్రాగస్టుకు భారీ బందోబస్తు ‘సీసీసీ’ నుంచి

గోల్కొండ కోట పర్యవేక్షణ అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటు  

నిఘా విభాగాల హెచ్చరికలతో అప్రమత్తం  

నగరవ్యాప్తంగా గస్తీ ముమ్మరం  

అడుగడుగునా తనిఖీలు వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు  

సీఎం కాన్వాయ్‌ రిహార్సల్స్‌ను పరిశీలించిన సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి  

సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్‌ విభాగం అప్రమత్తమైంది. గోల్కొండ కోటపై డేగకన్ను వేసింది. కశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో నిఘా విభాగాల హెచ్చరికలతో ఈసారి భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారులను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీస్‌ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్‌ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేసింది. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ నిఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా గోల్కొండ కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది.

వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరించేందుకు ఉపయోగించనున్నారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌బాటిళ్లు తదితర తీసుకురావడం నిషేధించారు. ఈ మేరకు అంజనీకుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరమై ఎవరైనా తీసుకొచ్చినా కచ్చితంగా సోదా చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. లాడ్జిలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. 

900 మంది సిబ్బంది...   
వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌ వద్ద ట్రాఫిక్‌ విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు 900 మంది ట్రాఫిక్‌ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. ముందుగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ముఖ్యమంత్రి గోల్కొండలో జరిగే వేడుకలకు వెళ్లే అవకాశం ఉంది. వేడుకలు జరిగే సమయాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు, ట్రాఫిక్‌ నిలిపివేత వంటివి ఆయా రూట్లలో చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం తెలిపారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు హాజరవుతున్నారని అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్‌ వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్‌ విభాగాలుగా చేసి ప్రభుత్వం నుంచి పాసులు జారీ అవుతున్నాయి. ఆయా పాసులు కల్గి ఉన్న వారికి పాస్‌ వెనకాల పార్కింగ్‌ స్థలం, గోల్కొండలో జరిగే వేడుకలకు వచ్చే మార్గం వంటి సూచనలు కూడా ఉన్నాయి. పార్కింగ్‌ స్థలాల నుంచి వేడుకల వరకు దూరం ఎక్కువగా ఉంటే అక్కడి పరిస్థితులను బట్టి బస్సులను కూడా ఆయా విభాగాలు ఏర్పాటు చేయనున్నాయి. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా వచ్చే వారి కోసం కావాల్సిన గొడుగులను జీహెచ్‌ఎంసీ అందుబాటులోకి తేనుంది. పాస్‌లు కలిగిన వారు పోలీసులకు స్పష్టంగా కన్పించే విధంగా దాన్ని కారుకు ముందుభాగంలో ఎడమవైపు అద్దాలకు అంటించుకోవాలని, విధి నిర్వహణలో ఉండే పోలీసులకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నారు. వేడుకలు పూర్తయిన తరువాత వారికి సూచించిన మార్గంలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..
గురువారంఉదయం7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్‌ ఉన్న వాహనాలకు మాత్రమే ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు ఈ రూట్‌లోకి అనుమతిస్తారు.  
సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్‌ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్‌ జంక్షన్‌ నుంచి లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్రా ఫ్లోర్‌ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పు ఖాన్‌ బ్రిడ్జి, రాందేవ్‌గూడ రైట్‌ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్‌సీసీ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.   

సీఎస్‌ పరిశీలన
గోల్కొండ: సీఎం కాన్వాయ్‌ వచ్చే మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అధికారులకు సూచించారు. మంగళవారం గోల్కొండ కోటలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి సీఎం కాన్వాయ్‌ రీహార్సల్స్‌ను పర్యవేక్షించా రు. అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కాన్వాయ్‌ వచ్చే మార్గానికి ఇరువైపులా భద్రతా సిబ్బందికి తప్ప మిగతా ఎవరూ ఉండకూడదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధిపతి ఎం.కె.సింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన పతావిష్కరణ రిహార్సల్స్‌ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, సెక్యూరిటీ విభాగం అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు