రాజ్‌భవన్‌ రోడ్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

15 Aug, 2019 07:17 IST|Sakshi

ఆహూతులకు ప్రత్యేక పార్కింగ్స్‌ కేటాయింపు

సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గురువారం గవర్నర్‌ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 8 గంటల వరకు రాజ్‌భవన్‌ రూట్‌లో ట్రాఫిక్‌ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైతరాబాద్‌ చౌరస్తా వరకు రాజ్‌భవన్‌ రోడ్డు రెండువైపుల రహదారి రద్దీ ఉంటుంది, దీంతో ఈ రూట్‌లో ఆ సమయంలో వెళ్లే వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిందని అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ సూచించారు. ఈ దారిలోట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, అతిథులకు ప్రత్యేక పార్కింగ్, ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. 

వీవీఐపీలు ముఖ్యమంత్రి, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్, శాసన మండలి ఛైర్మన్, స్పీకర్, కేంద్ర మంత్రి, క్యాబినెట్‌ మంత్రులు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్‌ నెం.1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, గేట్‌–2 నుంచి బయటకు రావాలి. ఆ తరువాత ఈ వాహనాలను రాజ్‌భవన్‌ కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో పార్కు చేయాలి.  
పింక్‌ కారు పాస్‌ కలిగిన ఇతర అతిథులు, గేట్‌ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేట్‌ నుంచి బయటకు వెళ్లాలి. వైట్‌ కారు పాసు కల్గిన వారు గేట్‌ నెం.3 వద్ద ఆగి, ఆయా వాహనాలను ఎంఎంటీఎస్‌ పార్కింగ్‌ లాట్, ఎంఎంటీఎస్‌ సమీపంలోని పార్క్‌ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్‌ స్కూల్‌ వరకు సింగిల్‌ లైన్, లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌ ఎదురుగా సింగిల్‌ లైన్‌లో పార్కింగ్‌ చేసుకోవాలి. 

మరిన్ని వార్తలు