గణతంత్ర వేడుకలపై డేగకన్ను

25 Jan, 2020 08:14 IST|Sakshi

బందోబస్తు విధుల్లో 1500 మంది పోలీసులు

పబ్లిక్‌ గార్డెన్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఆదివారం జరుగనున్న గణతంత్ర  వేడుకల సందర్భంగా నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్‌–డే పరేడ్‌ జరిగే పబ్లిక్‌ గార్డెన్స్‌ను శనివారం పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచిస్తారు. పబ్లిక్‌గార్డెన్స్‌తో పాటు ఆ చుట్ట పక్కల ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. గార్డెన్స్‌ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్‌ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని ఇక్కడ మోహరిస్తున్నారు. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పబ్లిక్‌గార్డెన్స్‌కు దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల వద్ద మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు.  పరేడ్‌ను వీక్షించడానికి వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్‌ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు, బ్రీఫ్‌ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. బందోబస్తు చర్యల్లో భాగంగా ఈసారి గగనతలంపై నుంచి కూడా నిఘా ఏర్పాటు చేశారు. రూఫ్‌ టాప్‌ వాచ్‌ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. గణతంత్య్ర వేడుకల నేపథ్యంలో తాజ్‌ ఐలాండ్, ఛాపెల్‌ రోడ్‌ ‘టీ’ జంక్షన్, సైఫాబాద్‌ పాత పోలీస్‌ స్టేషన్, బషీర్‌బాగ్‌ జంక్షన్, ఇక్బాల్‌ మీనార్, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్, ఆదర్స్‌నగర్‌ వద్ద ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. ఈ పాయింట్స్‌ దాటి సాధారణ ట్రాఫిక్‌ను పబ్లిక్‌గార్డెన్స్‌ వైపు అనుమతించరు.

>
మరిన్ని వార్తలు