గణతంత్ర వేడుకలపై డేగకన్ను

25 Jan, 2019 10:49 IST|Sakshi
పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

బందోబస్తు విధుల్లో 1500 మంది పోలీసులు

పరేడ్‌ గ్రౌండ్స్, గవర్నర్‌ నివాసం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్‌–డే పరేడ్‌ జరిగే సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ను గురువారం నాటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచించనున్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. గ్రౌండ్స్‌ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్‌ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్‌ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగించనున్నట్లు సమాచారం. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లోకి దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల దగ్గర మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్‌ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు, బ్రీఫ్‌ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈసారి గగన తలంపై నిఘా సైతం ఏర్పాటు చేశారు. రూఫ్‌ టాప్‌ వాచ్‌ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క శనివారం సాయంత్రం గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో సోమాజిగూడ పరిసరాల్లోనూ గట్టి బందోబస్తుఉండబోతోంది. 

రాజ్‌భవన్‌ పరిసరాల్లో ఇలా...
రిపబ్లిక్‌–డేను పురస్కరించుకుని గవర్నర్‌ తన అధికార నివాసంలో ఇవ్వనున్న ఎట్‌ హోమ్‌ విందు నేపథ్యంలో రాజ్‌భవన్‌ పరిసరాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ పేర్కొన్నారు. గులాబీ రంగు పాస్‌లతో వచ్చే ఆహుతులు రాజ్‌భవన్‌ గేట్‌–1 ద్వారా లోపలకు ప్రవేశించాలి. దర్బార్‌ హాలు ఎదురుగా వాహనాలు ఆపాలి. వీటిని అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర పార్క్‌ చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు పాస్‌లకు గేట్‌–2 కేటాయించారు. ఇవి కూడా దర్బార్‌ హాల్‌ దగ్గర ఆహుతులను దింపి అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ దగ్గర పార్క్‌ చేసుకోవాలి. తెల్లరంగు పాస్‌లకు గేట్‌–3 కేటాయించారు. వీరికి దిల్‌కుష్‌గెస్ట్‌ హౌస్‌లో పార్కింగ్‌ కేటాయించారు. మిగిలిన వారంతా తమ వాహనాలను ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లో పార్క్‌ చేసుకోవాలి. డ్యూటీ వెహికిల్స్‌కు చిల్లా వద్ద పార్కింగ్‌ చేయాలి.

పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో, గవర్నర్‌ అధికార నివాసమైన రాజ్‌భవన్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు వీటిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.  
సికింద్రాబాద్‌లోని సర్దార్‌పటేల్‌ రోడ్‌లోని సెంట్రల్‌ టెలిగ్రాఫ్‌ ఆఫీసు జంక్షన్‌–వైఎంసీఏ చౌరస్తా మధ్య శనివారం ఉదయం 7–11 గంటల మధ్య వన్‌–వే అమలులో ఉంటుంది. దీని ప్రకారం పరేడ్‌ ప్రారంభానికి ముందు సీటీవో జంక్షన్‌ నుంచి వైఎంసీఏ వైపు, పూర్తయిన తరవాత వైఎంసీఏ నుంచి సీటీవో జంక్షన్‌ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇదే సమయంలో కంటోన్మెంట్‌ గార్డెన్స్‌–ఎస్‌బీహెచ్‌ చౌరస్తా మధ్య ఎలాంటి వాహనాల ప్రవేశానికి అనుమతి ఉండదు.
బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ కింది నుంచి ప్రయాణించి ప్యారడైజ్, బాలమ్‌రాయ్‌ మీదుగా పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి.
సెయింట్‌ జాన్స్‌ రోటరీ నుంచి వచ్చే వాహనాలు వైఎంసీఏ ఫ్లైఓవర్‌ కింది నుంచి వచ్చి ఉప్‌కార్‌ చౌరస్తా లేదా క్లాక్‌ టవర్‌ మీదుగా గ్రౌండ్స్‌కు రావాలి.
సికింద్రాబాద్‌ క్లబ్‌ ఇన్‌గేట్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీహెచ్‌ చౌరస్తాకు అనుమతించరు. వైఎంసీఏ క్రాస్‌రోడ్స్‌ లేదా టివోలీ చౌరస్తా మీదుగా వెళ్లాలి.
ఆర్పీ రోడ్‌ నుంచి ఎస్బీహెచ్‌ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్‌ లేదా క్లాక్‌ టవర్‌ వైపు మళ్లాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు