జరిమానాలకూ జడవడం లేదు!

15 Jul, 2019 07:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వేగం కంటే గమ్యం ముఖ్యం’రోడ్డు భద్రతలో ప్రధాన నినాదం ఇది. దీనికి భిన్నంగా యు వత దూసుకుపోతోంది. వేగమే ముఖ్యమనుకొని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రాణాల రక్షణకు ప్రాధాన్యమివ్వడంలేదు. వేల రూపాయల జరిమానాలు చెల్లిస్తున్నారే తప్ప.. నిబంధనలను పాటించడంలేదు. 33 జిల్లాల్లో రోజూ నమోదవుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. ఓవర్‌ స్పీడ్, రాంగ్‌ పార్కింగ్, సీటు బెల్టు ధరించకపోవడం, డ్రైవింగ్‌లో మొబైల్‌ మాట్లాడటం, గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర కేసులు రోజురోజు కూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 12,46,420 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 6,924 కేసులకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఆరునెలల్లో మొత్తం రూ.58.86 కోట్ల జరిమానా చెల్లించారు. అంటే రోజుకు రూ.3.22 లక్షలు కడుతున్నారన్నమాట. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా ఇవి అధికమవుతుండటం గమనార్హం. ఇలా రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్నవారిలో అధిక శాతం విద్యావంతులు, యువత, ఉద్యోగులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. చలానాలు కట్టే వాహనాల్లో ఎక్కువగా కార్లు, బైకులు ఉంటున్నాయని పోలీసులు తెలిపారు.

 డ్రైవింగ్‌ టెస్ట్‌ పెట్టి లాభమేంటి?
ఏ వాహనమైనా రోడ్డు మీదకు రావాలంటే డ్రైవింగ్‌ పరీక్షలు పాస్‌ కావాల్సిందే. లెర్నింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌) కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడే అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. అందులో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు చిహ్నాలు, పాటించాల్సిన నిబంధనలను గుర్తు పట్టి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అడ్డదారిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందే వారిలో ఉల్లంఘనులు అధికం. ఎల్‌ఎల్‌ఆర్‌ టెస్టును పకడ్బందీగా అమలు చేస్తేనే ఇలాంటి ఉల్లంఘనలు, ప్రమాదాలు తగ్గుతాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

12 పెనాల్టీ పాయింట్ల సిస్టమ్‌ అటకెక్కినట్లేనా?
హైదరాబాద్‌ నగర పరిధిలో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన ట్రాఫిక్‌ ఉల్లంఘన 12 పెనాల్టీ పాయింట్ల సిస్టమ్‌ మంచి ఫలితాలనే ఇచ్చింది. తరచూ ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి డ్రైవింగ్‌ లైసెన్సుతోపాటు వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌(ఆర్‌సీ)ని కూడా రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్లలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి 12 పాయింట్లకు చేరుకుంటే.. వారి వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అధికారులు భావించారు. కానీ, దీని అమలులో పలు సాంకేతిక, చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో దీన్ని అధికారులు తాత్కాలికంగా పక్కనబెట్టారు. ఈ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తే.. ఉల్లంఘనలు తగ్గి ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.    

మరిన్ని వార్తలు