మేమింతే..!

17 May, 2018 10:11 IST|Sakshi

ఈ–చలాన్ల మోతలోనూ మారని తీరు

మూడేళ్లలో 1.04 కోట్ల ఉల్లంఘనులు

నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ కేసులు

నిబంధనలు  పట్టించుకోకపోవడమే సమస్య

మౌలిక వసతుల లేమి నగరవాసి జేబుకు చిల్లు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ ఏటా అనూహ్యంగా పెరుగుతోంది... నియంత్రణ కోసం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తి ఫలితాలు దక్కడం లేదు. ఓ పక్క ఉల్లంఘనులను చలాన్లతో చావబాదుతూ దొరికినకాడికి వసూలు చేస్తున్నా మార్పు శూన్యం... నిబంధనలు మనకోసమే అన్న సామాజిక స్పృహ వాహనచోదకుల్లో, మౌలిక వసతులు కల్పించాలిన్న భావన జీహెచ్‌ఎంసీకి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, చైతన్యం చేయాలన్న స్ఫృహ ట్రాఫిక్‌ అధికారుల్లో పెరిగే వరకు ఈ పరిస్థితుల్లో మార్పు అసాధ్యం. 

ఇదీ పెరుగుదల స్థితి...
నగరంలో వాహనాల సంఖ్యను తలదన్నే రీతిలో ఉల్లంఘనులు పెరుగుతున్నారు. సిటీలో ఏటా వాహనాల సంఖ్య రెండు లక్షల చొప్పున పెరుగుతుండగా... ఉల్లంఘనులు దీనికి రెట్టింపుస్థాయిలో పెరుగుతున్నారు. సిటీలో 106 రకాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై చలాన్లు విధిస్తున్నారు. నగరంలో 2005లో 15.27 లక్షలుగా ఉన్న వాహనాల సంఖ్య 2017 నాటికి 50 లక్షలు దాటింది. ఇక ఉల్లంఘనుల విషయానికి వస్తే 2015లో వారి సంఖ్య 32.24 లక్షలు ఉండగా... 2017 నాటికి 38.82 లక్షలు దాటింది. ట్రాఫిక్‌ అధికారులకు ఉల్లంఘనలకు పాల్పడిన సిటిజన్లకు 2015లో రూ.61.42 కోట్లు జరిమానా విధించగా... ఇది గత ఏడాది ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో రూ.66.60 కోట్లుగా నమోదైంది. 

వారికి రెడ్‌ కూడా ‘గ్రీనే’...
ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఖాతరు చేయని వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏ జంక్షన్‌లో చూసినా వీరు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కొన్ని సెకన్ల వేచి చూడలేక ముందుకు ‘ఉరుకుతూ’ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి వారితో పాటు ఎదుటి వారి చావుకూ కారణమవుతున్నారు. నిబంధనలు పాటించాలన్న స్ఫృహ లేనందునే అనేక జంక్షన్లు జామ్‌ కావడానికీ ప్రధాన కారణమవుతోంది. వీటికితోడు స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ ఉల్లంఘనులకు జరిమానా విధిస్తున్నా... ఎక్కడా స్టాప్‌లైన్లు పూర్తిస్థాయిలో స్పష్టంగా కనిపించే పరిస్థితి లేదు. 

హెల్మెట్‌ కేసులే అత్యధికం
ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలన్నది ప్రాథమిక నిబంధన. రోడ్డు ప్రమాదాల బారినపడుతున్న ద్విచక్ర వాహనచోదకుల్లో 80 శాతం తలపై గాయాలతోనే మరణిస్తుంటారు. మరెందరో క్షతగాత్రులు తలలోని కీలక భాగాలు దెబ్బతిని జీవశ్ఛవాలుగా మారుతుంటారు. గత కొన్నేళ్లుగా ట్రాఫిక్‌  పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా అత్యధికంగా ఈ కేసులో నమోదవుతున్నాయి. సీట్‌ బెల్ట్‌ లేకుండా తేలికపాటి, భారీ వాహనాల్లో ప్రయాణమూ ప్రమాదహేతువే అయినా ఎవరికీ పట్టదు. ఈ ఉల్లంఘనులకు జరిమానా సైతం పక్కాగా ఉండటం లేదు.

మరిన్ని వార్తలు