కాటేసిన కుంపటి

20 Dec, 2018 01:54 IST|Sakshi
బుచ్చమ్మ, పద్మరాజుల మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు , బొగ్గుల కుంపటి

చలినుంచి రక్షణగా బొగ్గుల కుంపటి పెట్టుకున్న వైనం.. పొగకు ఊపిరాడక తల్లి, కొడుకు మృతి

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగిపోయింది. పెథాయ్‌ తుపాను ప్రభావంతో వీచిన శీతలగాలులకు తెలంగాణ గజగజ వణికిపోయింది. అయితే ఈ శీతల గాలులనుంచి తప్పించుకునేందుకు వేసుకున్న చలిమంటే ఓ తల్లీ, కొడుకుల ఊపిరి తీసింది. చలిమంటకోసం ఏర్పాటు చేసుకున్న బొగ్గులకుంపటి నుంచి పొగలు కమ్ముకుని ఊపిరాడక ఆ తల్లీ కొడుకులిద్దరూ నిద్రలోనే మృతి చెందారు. హృదయవిదారకమైన ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం, జల్లూరు గ్రామానికి చెందిన కె.సత్యబాబు, బుచ్చమ్మ (39) దంపతులు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ 25లో నివసించే సంకీర్త్‌ ఆదిత్యారెడ్డి ఇంట్లో పనిమనుషులుగా పనిచేస్తున్నారు.

వీరికి కూతురుతోపాటు కొడుకు పద్మరాజు (20) కూడా ఉన్నారు. ఆదిత్యారెడ్డి పెంపుడు కుక్క బుధవారం మృతి చెందడంతో దానిని ఖననం చేసేందుకు పనిమనిషి సత్యబాబు డ్రైవర్‌తో కలిసి కారులో ఉప్పల్‌కు వెళ్లారు. బాగా చలిగాలులు వీస్తుండటంతో సత్యబాబు భార్య బుచ్చమ్మ, కొడుకు పద్మరాజు తమ సర్వెంట్‌ క్వార్టర్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిప్పులు రాజేసుకుని చలిమంట వేసుకున్నారు. మంచం కింద ఓ బొగ్గులకుంపటి, టీవీ వద్ద ఇంకో కుంపటి ఏర్పాటు చేసి గాలికి నిప్పులు ఆరిపోకుండా గది వేడిగా ఉండాలనే ఉద్దేశంతో కిటికీలు, తలుపులు మూసేశారు. బుచ్చమ్మ కుర్చీలో కూర్చుని, పద్మరాజు మంచంపై పడుకుని టీవీ చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.  

ఊపిరాడకేనా?.. 
ఇల్లంతా పొగ నిండుకోవడంతో బుచ్చమ్మ, పద్మరాజులిద్దరూ ఊపిరాడక నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం మూడు గంటలకు ఆదిత్యారెడ్డి ఇంటికి అతిథులు రావడంతో టీ పెట్టేందుకు బుచ్చమ్మను పిలవాలని యజమానురాలు ఇంకో పనిమనిషిని పంపగా... ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో పడుకున్నారనుకుని తిరిగి వెనక్కి వచ్చేసింది. కొద్దిసేపటికి సత్యబాబు వెంకటగిరిలో సామాన్లు తీసుకుని ఇంటికివచ్చి తలుపులు కొట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూడగా ఇల్లంతా పొగలువ్యాపించి ఉంది. సత్యబాబు డ్రైవర్‌తో కలిసి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్ళి చూడగా కుర్చీపై భార్య, మంచంపై కొడుకు విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జూబ్లీహిల్స్‌ ఎస్సై శంకర్‌ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు