రాజేంద్రనగర్‌లో ఘోరరోడ్డుప్రమాదం!

6 Oct, 2019 17:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్‌ సర్వీస్‌ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి వెంట ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి.. పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న యువకులు కూడా గాయపడ్డారు.  కారును నడిపింది మైనర్‌ బాలుడని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మితిమీరిన వేగమే కారణం!
కారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని, బైక్‌ను ఢీ కొన్న అనంతరం కారు రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి దూసుకువెళ్లిందని స్థానికులు చెప్తున్నారు.  కారును నడిపిస్తున్న మైనర్‌ బాలుడితోపాటు మరో ఇద్దరు మైనర్లు కారులో ఉన్నారని, వారు కూడా గాయపడ్డారని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగరాజుగా గుర్తించారు. భార్యాబిడ్డతో కలసి తన బైక్‌పై హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు అతను వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు.. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు