సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌కు రైలు కూత

7 Jul, 2018 02:30 IST|Sakshi

  డిసెంబర్‌ నాటికి పట్టాలెక్కనున్న రైళ్లు

  శరవేగంగా కొనసాగుతున్న పనులు

  ఆ తరువాత గజ్వేల్‌ వరకు ప్యాసింజర్‌ రైళ్లు

  మొత్తం నాలుగు దశల్లో కొత్తపల్లి వరకు రైల్వేలైన్ల నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌కు త్వరలోనే రైల్వే సదుపాయం అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య చేపట్టిన రైల్వే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి రైళ్లను పట్టాలెక్కించే దిశగా దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రోడ్డు సదుపాయం మాత్రమే ఉన్న గజ్వేల్‌ ప్రజలకు త్వరలోనే రైలు కూత వినిపించనుంది. హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌ మధ్య ప్రతిరోజు రాకపోకలు సాగించే వేలాది మందికి ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ మార్గంలో ప్యాసింజర్‌ రైళ్లను కూడా నడపనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 151 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్లను మొదటి దశ కింద చేపట్టారు. ఇందుకోసం కావలసిన భూమిని, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్రప్రభుత్వం అందజేసింది. దీంతో పనుల్లో వేగం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి మనోహరాబాద్‌ వరకు డెమూ, మెమూ ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు లైన్లు పూర్తయితే ఈ రైళ్లను అక్కడి వరకు పొడిగిస్తారు. జనవరి నుంచి మార్చి మధ్యలో అన్ని భద్రతా పరీక్షలను పూర్తి చేసుకొని గజ్వేల్‌ వరకు రైళ్లను నడపనున్నారు. అలాగే ఈ మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలకు కూడా మార్గం సుగమం కానుంది.  

నాలుగు దశల్లో కొత్తపల్లి వరకు రైల్వేలైన్లు 
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు నేరుగా రైల్వే సదుపాయం లేదు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం మనోహరాబాద్‌–కొత్తపల్లి లైన్లను ప్రతిపాదించింది. దీనికి రైల్వేశాఖ నుంచి ఆమోదం లభించింది. మొత్తం రూ.1,160 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి, మౌలిక వసతులను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్మాణ వ్యయంలో మూడో వంతు నిధులను అందజేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడుతలుగా రూ.500 కోట్లను రాష్ట్రం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును మొత్తం 4 దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. మొదటి దశలో మనోహరాబాద్‌–గజ్వేల్‌ (32 కిలోమీటర్‌లు), రెండో దశలో గజ్వేల్‌– దుద్దెడ (33 కిలోమీటర్లు), మూడో దశ కింద దుద్దెడ–సిరిసిల్ల (48 కిలోమీటర్లు), నాలుగోదశలో సిరిసిల్ల– కొత్తపల్లి (38 కిలోమీటర్లు) మధ్య పనులను పూర్తి చేస్తారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.  

కొత్తగా రెండు రైల్వేస్టేషన్లు 
అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య నాచారం, ఈరానగర్‌లలో రెండు కొత్త రైల్వేస్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్‌ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 4 భారీ బ్రిడ్జీలు, మరో 43 చిన్న బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు. మరో 2 అతి పెద్ద రోడ్డు ఓవర్‌ బ్రిడ్జీలు, 6 చిన్న ఆర్‌వోబీలను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు.  

మరిన్ని వార్తలు