50 రోజుల్లో రైలు! 

12 Feb, 2020 03:26 IST|Sakshi

గూడ్స్‌లో గజ్వేల్‌ వరకు చేరిన పర్మనెంట్‌ పట్టాలు

చివరి దశలో పట్టాలు బిగించే పని

మార్చి చివరి వారంలో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ

ఆపై వారంలో అనుమతి వచ్చే వీలు

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌లో రైలు కూత పెట్టనుంది. అందుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. సరిగ్గా మరో 50 రోజుల్లో రైలు రాబోతోంది. కమిషనర్‌ ఫర్‌ రైల్వే సేఫ్టీ నుంచి వెంటనే అనుమతి వస్తే ఏప్రిల్‌ తొలివారంలో గజ్వేల్‌–సికింద్రాబాద్‌ మధ్య రైలు సేవలు మొదలవుతాయి. ప్రస్తుతం ట్రాక్‌పై పర్మినెంట్‌ పట్టాలు బిగించే కీలక పని చివరిదశకు వచ్చింది. స్టేషన్‌ భవనాలు, ప్లాట్‌ఫాంల పనులు మరో పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయి. మార్చి చివరి వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించేలా పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆపై రైల్వే బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటమే తరువాయి, వెంటనే మెమూ రైలును ప్రారంభించనున్నారు. వెరసి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న.. రైల్వే ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌ను రాజధానితో అనుసంధానించే కీలక ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. తనిఖీ చేసిన వారంలో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నివేదికిచ్చే అవకాశముంటుందని అధికారులు చెబున్నారు.

పట్టాల తరలింపు సమస్య పరిష్కారం.. 
మనోహరాబాద్‌ నుంచి ఈ మార్గం మొదలవుతుంది. అక్కడికి 32 కి.మీ. దూరంలో ఉన్న గజ్వేల్‌ వర కు మొదటిదశ కొనసాగుతుంది. గజ్వేల్‌కు 21 కి.మీ. ముందు నిజామాబాద్‌ హైవే వరకు గతంలో నే అన్ని పనులు పూర్తి చేశారు. కానీ హైవే దాటి గ జ్వేల్‌ వైపు పట్టాల తరలింపు సాధ్యం కాక అటు వైపు పనులు చేయలేదు. ప్రస్తుతం పట్టాల లోడుతో గూడ్సు రైలు వచ్చేందుకు వీలుగా గజ్వేల్‌ వైపు చి న్న పట్టాలతో తాత్కాలిక ట్రాక్‌ సిద్ధం చేశారు. రైలు వచ్చేందుకు తాత్కాలిక పట్టాలు అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు ఐదు రోజుల క్రి తం ఓ ఇంజిన్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 21 కి.మీ.కు గాను 16 కి.మీ.కు సరిపోయేలా మూడు లోడులతో పట్టాలను తెచ్చి డంప్‌ చేశారు. ఇందులో ఇప్పటికే కొన్ని కి.మీ. మేర పనులు పూర్తయ్యా యి. మరో 25 రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత స్లీపర్‌ ప్యాకింగ్‌ యంత్రంతో వాటిని జో డించటంతో ఈ పనులు మొత్తం పూర్తవుతాయి. ఇక ఈ మార్గంలో ఉండే 3 స్టేషన్లకు సంబంధించి మనోహరాబాద్‌ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్లు ఉంటాయి. వీటిల్లో నాచారం, గజ్వేల్‌ భవనాలు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలిఉన్నాయి. అప్పాయిపల్లిలో భవనం పూర్తికావొచ్చింది. ప్లాట్‌ఫారంల పనులు పూర్తి కావాల్సి ఉంది.

పూర్తయిన బ్రిడ్జీల నిర్మాణం..
ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్‌ ఓవర్, బ్రిడ్జీలు మూడు రోడ్‌ అండర్‌ బ్రిడ్జీలున్నాయి. అవన్నీ పూర్తయ్యాయి. నాచారం వద్ద హల్దీ నదిపై, గన్‌పూర్, అప్పాయిపల్లిల్లో మధ్యస్థ వంతెనల పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్‌ మీదుగా సాగే 44వ నంబర్‌ జాతీయ రహదారిని రైల్వే లైన్‌ క్రాస్‌ చేసే చోట దాదాపు 100 మీటర్ల మేర పెద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ పనిని జాతీయ రహదారుల విభాగం చేపడుతోంది. ఇప్పటికే రెండు అండర్‌పాస్‌లు నిర్మించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలను వాటి గుండా మళ్లించారు. ఆ రోడ్డును రైలు దాటేందుకు వీలుగా పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు.

మరిన్ని వార్తలు