అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తాం!

23 Jun, 2014 02:14 IST|Sakshi
అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తాం!

33 శాతానికి అడవులు పెంచుతాం
పర్యావరణ అసమతుల్యతే సర్వ అనర్థాలకు హేతువు
‘సాక్షి’తో అటవీ, పర్యావరణ  మంత్రి జోగు రామన్న

 
హైదరాబాద్: అడవుల సంరక్షణకుగాను అటవీ సిబ్బందికి ఆయుధాలను సమకూర్చాలని యోచిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. వర్షాభావం, ఆయుర్దాయ ప్రమాణాలు, మానవ జీవచక్రంలో క్రమగతులు తప్పడం వంటి సర్వ అనర్థాలకు మూలహేతువు పర్యావరణ అసమతుల్యతే అని అన్నారు. అటవీశాఖ విస్తీర్ణం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించనున్న విధానం వంటివాటిపై ‘సాక్షి’తో జోగు రామన్న ప్రత్యేకంగా మాట్లాడారు.  ప్రభుత్వం తీసుకోబోయే చర్యల గురించి ఆయన మాటల్లోనే...

అడవులకు హద్దులు లేవు: రిజర్వు అడవులకు ఇప్పటివరకు హద్దులు లేవు. నిజాం హయాంలో జరిగిన సర్వే ప్రకారంగానే హద్దులున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, సమస్యలపై అధికారుల నుంచి సమగ్ర నివేదికలు కోరినం. త్వరలోనే సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులు పాతుతం.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 5 కోట్ల మొక్కలు: జిల్లాకు 2 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 కోట్ల మొక్కలు పెడతం.  సంరక్షణ చర్యలు తీసుకుంటం. అడవులను 23 నుంచి 33 శాతానికి ఐదేళ్లలో పెంచుతం.

స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం: అడవుల నరికివేత, వృక్ష సంపద అపహరణ, స్మగ్లింగ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. గతంలో అటవీశాఖ సిబ్బందికి ఆయుధాలుండేవి. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయుధాలు అపహరణకు గురవుతున్నాయని వాటిని ఉపసంహరించిన్రు. మళ్లీ ఆయుధాలను ఇవ్వాలనుకుంటున్నం.  

పరిశ్రమలకు అడవులను బలిపెట్టం: పరిశ్రమలు రావాల్సిందే.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, రాష్ట్ర స్థూలాదాయం పెరగాల్సిందే. పారిశ్రామిక అభివృద్ధికి అడవులను, పర్యావరణాన్ని బలిపెట్టం. అడవి చల్లగా ఉంటే సమస్యలన్నీ పోతయి. సకాలంలో వానలు పడతయి. స్వచ్ఛమైన గాలి, నీరు సమృద్ధిగా ఉంటయి. పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్‌ను కేటాయిస్తాం. యూనిట్లవారీగా సమతుల్యతను లెక్కగడతాం. కాలుష్య ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కాలుష్య నియంత్రణ బోర్డుకు ప్రత్యేక అధికారాలు ఇస్తాం. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
 
 

మరిన్ని వార్తలు