ట్రైనీ ఐపీఎస్ మృతి

30 Aug, 2014 23:49 IST|Sakshi
ట్రైనీ ఐపీఎస్ మృతి

హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఓ ఐపీఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తోటి ట్రైనీల విందులో మద్యం సేవించి, అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడంతో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం అర్థ్ధరాత్రి చోటుచేసుకుంది. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన మను ముక్త్త్ మానవ్ (30) 2013లో హిమాచల్‌ప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. వీరి బ్యాచ్‌లో ఉన్న 146 మంది గత ఏడాది నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి వీరంతా కలిసి అక్కడే ఉన్న ఆఫీసర్స్ క్లబ్‌లో విందు చేసుకున్నారు. ఈ విందులో మద్యం సేవించిన మానవ్ మరో ఇద్దరు ట్రైనీలతో కలిసి ఎన్‌పీఏలో ఉన్న స్విమింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగిన కొద్దిసేపటికే మానవ్ నీటిలో మునిగి మృతి చెందారు.
 
 

ఇతని వెంటే ఉన్న మరో ఇద్దరు ఈ విషయాన్ని పసిగట్టే లోపే ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో తోటి ఐపీఎస్‌లు మానవ్‌ను హుటాహుటిన అదేరాత్రి కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తేల్చారు. ఈ మేరకు యన్‌పీఏ ఎస్‌ఐ షేక్ అబ్దుల్ సమద్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు మానవ్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయడంతో వారు శుక్రవారం నగరానికి చేరుకుని బోరున విలపించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుం బ సభ్యులకు అప్పగించారు. హర్యానాలోని స్వగ్రామంలో మానవ్ అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనతో ఎన్‌పీఏలో విషాదఛాయలు అలుముకున్నాయి. మందుపార్టీ ఎవరు ఇచ్చారు.. ఎవరెవరు పాల్గొన్నారు.. మానవ్ స్విమ్మింగ్‌పూల్‌లోకి ఎలా వచ్చారు.. వెంట ఎవరున్నారు.. తదితర విషయాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు