దేశమంతా.. రైలుకూత

28 May, 2020 05:16 IST|Sakshi

జూన్‌ 1 నుంచి రైళ్ల రాకపోకలకు సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లు సిద్ధం

దేశంలోని వివిధ ప్రాంతాలకు నడవనున్న 9 రైళ్లు

ప్రస్తుత నిబంధనలన్నీ ఇకముందూ పక్కాగా అమలు

లిఫ్టులు, ఎస్కలేటర్లకు ‘నో’..సాధారణ బోగీల్లోనూ రిజర్వేషన్‌

అన్ని రైళ్లలో 80 నుంచి 100 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 1 నుంచి పలు రైళ్ల రాకపోకలకు వీలుగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లు సిద్ధమవుతున్నాయి. సుమారు 9 రైళ్లు ఈ రెండు స్టేషన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరగనున్న దృష్ట్యా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10వ నంబర్‌కు అదనంగా ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – బెంగళూరు మధ్య రోజూ రెండు రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే వారానికి ఒక రైలు సికింద్రాబాద్‌ – న్యూఢిల్లీ, న్యూఢిల్లీ – సికింద్రాబాద్‌ మధ్య నడుస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న ఈ ప్రత్యేక రైళ్లతో పాటు జూన్‌ 1 నుంచి సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల మీదుగా హైదరాబాద్‌ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌ – తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – ధానాపూర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – నిజాముద్దీన్‌ దురంతో ఎక్స్‌ప్రెస్, ముంబై – భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌ – ముంబై హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్‌ – విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవికాక మరికొన్ని రైళ్లు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు భర్తీ అయ్యాయి. వెయిటింగ్‌ లిస్టు సైతం 80 నుంచి 100 వరకు చేరుకుంది.

రెండుచోట్లా అదనపు ఏర్పాట్లు
ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తుండటంతో సికింద్రాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య రోజుకు 900 నుంచి 1,000 వరకు మాత్రమే ఉంది. దీంతో రైళ్ల రాకపోకలను ప్రస్తుతం 10వ నంబర్‌కే పరిమితం చేశారు. జూన్‌ 1 నుంచి ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానుండటంతో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాంపల్లిలోనూ ఇక నుంచి రైళ్లు ఆగనున్నాయి. ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరగనున్న దృష్ట్యా వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్యా పెరగనుండటంతో ఈ రెండు రైల్వేస్టేషన్లలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అదనంగా థర్మల్‌ స్క్రీనింగ్‌లు
సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం ప్రవేశమార్గంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేశాకనే లోనికి అనుమతిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్ల నిబంధనలే జూన్‌ 1 నుంచి నడిచే వాటికీ వర్తిస్తాయి. ప్రయాణికుల మధ్య భౌతికదూరం తప్పనిసరి. ప్రతి ప్రయాణికుడి వివరాలు రైల్వే వద్ద నమోదయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను కలిగి ఉండాల్సిందే. రిజర్వేషన్‌ టికెట్‌ ఉన్న ప్రయాణికులనే అనుమతిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లను మాత్రం వినియోగించరు. రైళ్లలో, రైల్వేస్టేషన్లలో టికెట్‌ తనిఖీ సిబ్బందిని కూడా పెంచనున్నారు. రైళ్లను, రైల్వేస్టేషన్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేయడంతో పాటు అనుమతి లేనివారు ప్రవేశించకుండా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తారు.

వివరాల నమోదు తప్పనిసరి
లాక్‌డౌన్‌ వేళలో నడుపుతున్న ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలో ఇకపై సాధారణ బోగీల్లో ప్రయాణించాలన్నా రిజర్వేషన్‌ తప్పనిసరి. కరోనా ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల వివరాలను నమోదు చేసేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా, రిజర్వేషన్‌ కౌంటర్ల ద్వారా టికెట్‌ పొందే వారంతా తమ వివరాలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. 

>
మరిన్ని వార్తలు