ట్రామా‘కేర్‌’ ఏమైనట్టు?

11 Jun, 2019 08:16 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌పై ఐదు ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన  

అలసత్వం వహిస్తున్న హెచ్‌ఎండీఏ

ఏడాది క్రితం నిర్ణయించినా పట్టాలెక్కని పనులు

సాక్షి,సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై జరిగే ప్రమాదాల్లో గాయపడే వాహన చోదకులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు తీసుకొస్తామన్న ‘ట్రామాకేర్‌’ సెంటర్ల ఏర్పాటు హామీలకే పరిమితమైంది. ప్రకటించి ఏడాది గడుస్తున్నా కనీసం ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓఆర్‌ఆర్‌పై గంటకు 120 కిలోమీటర్ల ఉన్న వేగ పరిమితిని 100కు తగ్గించినా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో గాయపడిన వారికి సత్వర వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు తెరపైకి వచ్చింది. గతేడాది మే ఒకటిన ఓఆర్‌ఆర్‌ కండ్లకోయ జంక్షన్‌ సేవలు ప్రారంభించిన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా ఏలాంటి ప్రగతి సాధించలేదు. తొలుత పటాన్‌చెరు, మేడ్చల్, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్‌ ప్రాంతాల్లో ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ పూర్వ కమిషనర్‌ టి.చిరంజీవులు ప్రతిపాదనలు రూపొందించి  వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించారు. అయితే, తర్వాత అధికారులు వాటిని పట్టించుకోవడమే మానేశారు. ఎంతోమంది ప్రమాద బాధితులకు ప్రాణాలు పోసే ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఓఆర్‌ఆర్‌ వినియోగదారులు మండిపడుతున్నారు. వాహన ప్రయాణానికి టోల్‌ వసూలు చేస్తున్న అధికారులు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరాకపోవమేంటని ప్రశ్నిస్తున్నారు. 

కార్యరూపం దాల్చని భద్రత
కండ్లకోయ జంక్షన్‌ పూర్తితో గతేడాది మే ఒకటిన సంపూర్ణ 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, అతివేగంతో వెళ్లే సందర్భంలో రోడ్డు ప్రమాదాలు జరగుతుండటంతో పాటు ఓఆర్‌ఆర్‌ వినియోగించే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తే చాలా మందిని బతికించవచ్చని మంత్రి కేటీఆర్‌ సూచించడంతో ఆ దిశగా హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్‌ టి.చిరంజీవులు చర్యలు తీసుకున్నారు. గోల్డెన్‌ అవర్‌లో క్షతగ్రాతుడికి తక్షణ వైద్యం కోసం తొలుత పటాన్‌చెరు, మేడ్చల్, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖను ఐదు నెలల క్రితం లేఖ రాశారు. దీంతో పాటు ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పది అంబులెన్స్‌ల సంఖ్యను 16కు పెంచాలని తీసుకున్న నిర్ణయం కూడా అమలుకాలేదు. అలాగే హెచ్‌టీఎంఎస్‌ వ్యవస్థతో ఓఆర్‌ఆర్‌ను అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా ఇట్టే తెలిసిపోయి అంబులెన్స్‌ ఘటనాస్థలికి త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఆచరణ రూపంలోకి రావడం లేదు. ఇప్పటికైనా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ దృష్టి సారించి ట్రామాకేర్‌  కేంద్రాల ఏర్పాటులో చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరిన్ని వార్తలు