‘కేంద్రం’ నుంచే వివరణ తీసుకోండి!

28 Aug, 2019 03:00 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డి.ప్రభాకర్‌రావు

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపణలపై ట్రాన్స్‌కో సీఎండీ స్పందన

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని.. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలతో ఈ రెండు సంస్థల మధ్య జరిగిన లావాదేవీలపై  అపోహలుంటే వాటి నుంచే వివరణ తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కోరారు. మంగళవారం ఆయన విద్యుత్‌సౌధలో విలేకరుల సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలకు సమాధానాలిచ్చారు. రూ.4.30కు యూనిట్‌ చొప్పున రాష్ట్రానికి సౌర విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎన్టీపీసీ ఆసక్తి చూపినా, కొనుగోలు చేయకుండా ఇంతకన్నా అధిక ధరతో  ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్లు చేశాయని చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.

ఎన్టీపీసీ ఆఫర్‌ చేసిన విద్యుత్‌ ధరను లక్ష్మణ్‌ ఒక్కోసారి ఒక్కో విధంగా పేర్కొంటున్నారని, యూనిట్‌కు రూ.4.66 నుంచి రూ.5.19 ధరతో ఎన్టీపీసీ నుంచి 400 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోళ్లకు 2016లో ఒప్పందం చేసుకుని కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. మణుగూరులో భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం కోసం నేరుగా బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం కోసం ఇండియా బుల్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల్లో  నిజం లేదన్నారు. ఈ విషయంలో అనుమానాలుంటే ఎన్టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి వివరణ తీసుకోవాలని చెప్పారు. ‘టీఆర్‌ఎస్‌ కండువా వేసుకున్నారని లక్ష్మణ్‌ అనడం ఆవేదన కలిగించింది.  టీడీపీ,కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో పనిచేశాను. ఇప్పుడు  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను. ఎప్పు డూ ఏ పార్టీ కండువా వేసుకోలేదు ’అని అన్నారు.

10 వేల ఎం.యూ.ల జలవిద్యుత్‌ కొరత 
బహిరంగ టెండర్ల ద్వారానే 2015లో సౌర విద్యుత్‌ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన యూనిట్‌కు రూ.5.79 గరిష్ట ధర పరిమితి లోపే ఈ ఒప్పందాలు జరిగాయి. లక్ష్మణ్‌ పేర్కొన్న గరిష్ట ధరకు సంబంధించి ఎంఎన్‌ఆర్‌ఈ నుంచి  మార్గదర్శకాలు రాలేదు.   ఈఆర్సీ ఆమోదించిన అంచనాలతో పోల్చితే 4 ఏళ్లలో 10,083 మిలియన్‌ యూనిట్ల  జలవిద్యుత్‌ లోటు ఏర్పడింది. దీన్ని పూడ్చుకోవడానికి తాత్కాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో అవసరమైన విద్యుత్‌ కొనుగోలు చేసి రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరాను కొనసాగించాం. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్ల ద్వారానే ఈ కొనుగోళ్లు జరిగాయి. హరియాణా మినహా  అన్ని రాష్ట్రాల డిస్కంలు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇక్కడి డిస్కంలే నష్టాల్లో ఉన్నట్లు ఆరోపించడం హాస్యాస్పదం’ అని అన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా