ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు 

6 Feb, 2019 00:58 IST|Sakshi

అంబర్‌పేట సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసిన రాచకొండ సీపీ 

ఆదిభట్లలో ఓ కేసు విషయంలో మల్లారెడ్డితో రాకేష్‌కు సాన్నిహిత్యం 

జయరామ్‌ హత్య తర్వాత కూడా ఫోన్‌ టచ్‌లోనే ఇద్దరూ... 

మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన మల్లారెడ్డి 

ఏపీ పోలీసుల నుంచి నివేదిక వచ్చాక విచారణ జరుపుతాం: సీపీ

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయనను అంబర్‌పేటలోని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(సీఏఆర్‌) హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం బాధ్యతల్ని వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణకు అప్పగించారు. జయరామ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డికి మృతదేహం తరలింపునకు సంబంధించి సలహాలిచ్చినట్లు నల్లకుంట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులుతో పాటు మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాసులును సోమ వారమే బదిలీ చేసిన విషయం విదితమే. రాకేష్, మల్లారెడ్డి మధ్య సెల్‌ఫోన్‌ సంభాషణలు జరిగాయని, జయరామ్‌ హత్య జరిగిన తర్వాతే ఈ కాల్స్‌ చేసుకున్నట్లు నందిగామ పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల నుంచి పూర్తి నివేదిక వచ్చాక మల్లారెడ్డి, శ్రీనివాసులుపై విచారణ చేపట్టనున్నారు.  
ఆదిభట్లలో కేసుతో పరిచయం... 
కొంగరకలాన్‌ సమీపంలోని తన భూమి హద్దు రాళ్లు, కడ్డీలను తొలగించి ఆక్రమించుకునేందుకు ప్రయ త్నించారని రాజేందర్‌రెడ్డి జూన్‌ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడిగా జితేందర్‌ రెడ్డి, రెండో నిందితుడిగా రాకేష్‌రెడ్డిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసు విచారణ సమయంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేష్‌రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతో తరచూ ఫోన్‌కాల్‌ చేసే రాకేష్‌రెడ్డి జయరామ్‌ హత్య తర్వాత కూడా మల్లారెడ్డితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు తేలింది. జయరామ్‌ హత్య కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన రాకేష్‌రెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారం కూడా మల్లారెడ్డి పేరు వినిపించడంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ బదిలీ వేటు వేశారు. 2012లో పోలీసు విభాగంలోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పెద్దపల్లి, ఉట్నూరు, ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లోనూ వివాదాస్పదుడిగా ముద్రపడిన మల్లారెడ్డి బడా కేసులను సెటిల్‌ చేశారనే ఆరోపణలున్నాయి.

పాత కేసులో  పరిచయంతోనే ఫోన్‌ కాల్‌...
రాకేష్‌రెడ్డి పాత కేసులో నిందితుడిగా ఉండటంతో ఏర్పడిన పరిచయంతోనే ఫోన్‌కాల్‌ చేశాడని ఏసీపీ మల్లారెడ్డి వివరిస్తున్నారు. తన ఇంట్లో ఇద్దరు కొట్టుకున్నారని, ఒకరికి గాయాలయ్యాయని ఫోన్‌ చేసి చెప్పాడన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారు చెప్పిన ప్రకారం నడుచుకోమని చెప్పానని మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ తతంగం జరిగింది ఈ నెల 1వ తేదీ కాగా... మంగళవారం వరకు ఆయన మిన్నకుండిపోయారు. ఆయనపై ఆరోపణలు మొదలైన తర్వాత తప్పించుకునేందుకే కొత్త వాదన వినిపిస్తున్నారని ఏపీ పోలీసులు అంటున్నారు. ఆయన చెబుతున్న విషయాలు వాస్తవమైతే శనివారం నుంచి రాకేష్‌ పేరు మీడియాలో వస్తోందని, జయరామ్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని తెలిసీ ఫోన్‌ కాల్స్‌ విషయం నందిగామ పోలీసులకు గాని, స్థానిక పోలీసులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులును జయరామ్‌ హత్య కేసులో అనుమానితులుగా చేర్చి విచారించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు