మాదాపూర్ అడిషినల్ డీసీపీపై బదిలీ వేటు

24 Dec, 2017 21:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ముత్యాల యోగి కుమార్‌ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్‌ ఇన్‌చార్జి, మాదాపూర్‌ అడిషనల్‌ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు(సీఎఆర్‌) హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు ఉన్న వీడియో టీవీ చానళ్లలో, సోషల్‌ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. 

తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యోగి ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు