‘సీనియార్టీ’పై అభ్యంతరాల వెల్లువ

19 Jun, 2018 00:59 IST|Sakshi

జాబితాపై ఏకంగా 25 వేల అభ్యంతరాలు 

పూర్తికాని పరిశీలన..రేపు తుది జాబితా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రకటించిన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దాదాపు మూడోవంతు టీచర్లు ఈ జాబితాపై అభ్యంతరాలు నమోదు చేశారు. ఒక్కో జిల్లాలో సగటున 2 వేలకుపైగా అభ్యంతరాలు రావడం గమనార్హం. బదిలీలకు రాష్ట్రవ్యాప్తంగా 75,317 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,514 మందికి ఒకేచోట పని చేసే సర్వీసు గడువు ముగియడంతో తప్పనిసరిగా బదిలీ కానుంది. మరో 43,803 మంది నిర్దేశిత సర్వీసు పూర్తి కానప్పటికీ స్థానచలనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు పరిశీలించిన విద్యాశాఖ అధికారులు ఈ నెల 15న ప్రాథమిక సీనియార్టీ జాబితా విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 17 వరకు తెలపాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది టీచర్లు సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు తెలిపారు. వీటిని పరిష్కరించి ఈ నెల 19న తుది సీనియార్టీ జాబితాను విద్యాశాఖ ప్రకటించాల్సి ఉంది. అయితే పరిశీలించాల్సిన అభ్యంతరాలు పెద్దసంఖ్యలో ఉండడంతో తుది జాబితాను ఈ నెల 20న ఇవ్వనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 

పరిశీలన ప్రహసనమే 
సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన విద్యాశాఖ అధికారులకు ప్రహసనంగా మారింది. వేలకొద్దీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితా విడుదల చేయడం అధికారులకు కత్తి మీద సాముగా మారింది. దీంతో కొన్ని జిల్లాల్లో అధికారులు హడావుడిగా పరిశీలిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, తుది జాబితాలో తప్పులు దొర్లితే ఊరుకునేది లేదని పీఆర్టీయూ అధ్యక్షులు సరోత్తంరెడ్డి విద్యాశాఖను హెచ్చరించారు. మరోవైపు బదిలీ షెడ్యూల్‌ గడువును పొడిగించాలని ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, సదానంద్‌గౌడ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్యను కలసి వినతిపత్రం అందజేశారు. 

21 నుంచి 24 వరకు వెబ్‌ ఆప్షన్లు
టీచర్ల బదిలీ ప్రక్రియలో వెబ్‌ ఆప్షన్ల నమోదు తేదీల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ ఆప్షన్లను 21 నుంచి 24 వరకు నిర్వహించనుంది. ఈ మేరకు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. 26న కమిటీ ఆమోదం కోసం జాబితాను డౌన్‌లోడ్‌ చేసి 27న బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించింది.  
 

మరిన్ని వార్తలు