అంత ‘అటాచ్‌మెంట్’ వద్దు

31 Jul, 2014 00:54 IST|Sakshi
  •       ఖైరతాబాద్ రైల్వే గేటును ఢీకొన్న వాహనం
  •      విరిగిపడిన గేటు
  •      కొత్తది అమర్చిన పోలీసులు
  •      రైళ్ల రాకపోకలకు అంతరాయం
  • ఖైరతాబాద్: ఖైరతాబాద్ రైల్వే గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే గేటు వద్ద ప్రమాదాలను అరికట్టేందుకు ఇటీవల రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. గేటు వేసిన సమయంలో రాకపోకలు సాగనివ్వకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాలి నడకన వెళ్లే వారికీ అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా... బుధవారం మధ్యాహ్నం రైలు వెళ్లగానే గేటును తీశారు. ఆ సవ యంలో ఖైరతాబాద్ నుంచి సాదాన్ కళాశాల వైపు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని డ్రైవర్ బాల్‌రాజ్ హడావుడిగా ముందుకు కదిలించాడు.

    కుడి వైపు నుంచి దాటాల్సిన వాహనాన్ని హడావుడిగా ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో డీసీఎం వెనుక భాగం గేటును బలంగా తాకింది. ఒక్కసారిగా గేటు విరిగి పక్కకు పడిపోయింది. ఆ పక్కనే ఉన్న గేట్ జామ్ (ఇనుప బారికేడ్లపై) విరిగిన గేటు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఖైరతాబాద్ వినాయకుని వైపు వెళ్తున్న వాహనాలు అక్కడే నిలిచి ఉన్నాయి. గేట్ జామ్ లేకపోయి ఉంటే వాహనదారుల తలపై గేటు పడి, ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తూ గేట్‌జామ్ పైన అది పడడంతో ముప్పు తప్పింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
     
    ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

     
    గేటు విరిగిన విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వాహనదారులను పట్టాలపై నుంచి తొలగించి, ప్రత్యామ్నాయంగా మరో గేటును అమర్చారు. ఈ సంఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గతంలో పలుమార్లు గేటు విరిగిన సంఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరో గేటును సిద్ధంగా ఉంచారు. దీన్ని వెంటనే అమర్చడంతో రైళ్ల రాకపోకలకు తక్షణమే పునరుద్ధరించగలిగామని సిబ్బంది తెలిపారు.

    ఇరువైపులా అక్రమ నిర్మాణాలు
     
    రైల్వేగేటుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాల కారణంగా అక్కడి స్థలం ఇరుకుగా మారింది. గేటు వేసిన సమయంలో మనుషులు కూడా నిలబడేందుకు వీలులేకుండా తోపుడుబండ్లు, ఇతర  సామగ్రిని కొందరు అడ్డుగా పెట్టారు. ఇలాంటి బండ్లను, కట్టడాలను తొలగిస్తే గేటు వద్ద రాకపోకలకు సులువుగా ఉంటుందని స్థానికులు తెలిపారు.
     
    ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించరూ
     
    ఖైరతాబాద్  రైల్వేగేటు మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత ర ద్దీగా ఉండే ఈ క్రాసింగ్ వద్ద నిత్యం 108 సార్లు రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వేగేటు వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించుకన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఖైరతాబాద్ రైల్వే క్రాసింగ్ వద్ద సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

     

>
మరిన్ని వార్తలు