ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు దొరికారు

9 Oct, 2014 23:40 IST|Sakshi

మోమిన్‌పేట: కొంతకాలంగా ట్రాన్స్‌ఫార్మర్లు అపహరిస్తూ రైతులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగలు ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. తీగ లాగితే డొంకంతా కదిలింది అన్న చందంగా.. పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా నిందితులు ఆరుగురు దొరికా రు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన పంచలింగాల పర్మ య్య నాలుగేళ్ల క్రితం మోమిన్‌పేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు బేస్‌లో పని చేశాడు. అతడి తీరు బాగలేకపోవడంతో రెండేళ్ల క్రితం అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు. జల్సాలకు అలవాటు పడిన అతడు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోంచి కాపర్ తీగలు అపహరించేందుకు పథకం పన్నాడు.

తనొక్కడితో చోరీలు చేయడం కాదని భావించిన అతడు అదే గ్రామానికి చెందిన షేక్ ఆజం, అసిఫ్, ఎండీ రహమత్ అలీ, సీహెచ్ సంగయ్య, ద్యాంగ లాయక్ అలీతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు. వీరు సయ్యద్‌అల్లిపూర్ 2, కేసారం గ్రామంలో 2, మొరంగపల్లి 3, వెల్‌చాల్ గ్రామంలో 2, దుర్గంచెరువు గ్రామంలో 2 మొత్తం 11 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగలు అపహరించారు. కాపర్ తీగలను నగరంలోని బేగంబజార్‌లో విక్రయించేవారమని నిందితులు పోలీసులకు తెలిపారు.   
 
ఇలా దొరికిపోయారు..
విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గురువారం ఉదయం కేసారం గ్రామానికి చెందిన అసిఫ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అతడు మిగతా వారి పేర్లు చెప్పారు. ఈమేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.  

మరిన్ని వార్తలు