అవినీతి రహిత పాలనే లక్ష్యం: కేటీఆర్‌

26 Feb, 2020 02:00 IST|Sakshi

ప్రభుత్వ పథకాల కోసం ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదు

దేవరకొండలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌

సాక్షి, కొండమల్లేపల్లి: రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పర్యటించారు. అనంతరం వార్డు కమిటీల సమావేశంలో మాట్లా డారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పని లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో 75 గజాల సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారు అనుమతికోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, 75 నుంచి 600 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారు ము న్సిపాలిటీకి ఒక్క దర ఖాస్తు ఇస్తే 21 రోజుల్లో అధికారులు అనుమతులు ఇచ్చేలా చట్టం వచ్చిందని గుర్తు చేశారు.

21 రోజుల్లో ఇవ్వకపోతే 22వ రోజు అనుమతుల పత్రం మీకు వచ్చి చేరుతుందన్నారు. ఇందుకోసం టీఎస్‌బీపాస్‌ విధానాన్ని ఏప్రిల్‌ 2 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఇంటి పన్ను ఎంత చెల్లించాలో ప్రజలే నిర్ణయించుకోవచ్చునని, ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే వారికి 25 రెట్ల జరిమానా విధిస్తారని మంత్రి తెలిపారు. నూతన పంచాయితీరాజ్‌ చట్టంలోని ముఖ్యంశాలు ప్రజలకు తెలియజేసేందుకు కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో వక్ఫ్‌బోర్డు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు అందించే విషయంలో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ను కోరారు.  పట్టణ ప్రగతిలో వార్డుల ప్రత్యేక అధికారులు, కమిటీ సభ్యులతోపాటు వార్డు కౌన్సిలర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, తేరా చినపరెడ్డి తదితరులున్నారు. కాగా, పట్టణ ప్రగతిలో భాగంగా దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ, అధికారులతో కలసి మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. 

ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌ కావాలి 
పట్టణ ప్రగతిలో ఒక్కో వార్డు కౌన్సిలర్‌ వారి వార్డు కు ఒక్కో కేసీఆర్‌లా వ్యవహరించాలని కేటీఆర్‌ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో వార్డు కౌన్సిలర్‌లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అక్రమ లే ఔట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అలాం టి వాటిని గుర్తించి అక్రమార్కుల తాట తీస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే లు జైపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

అవ్వా పెన్షన్‌ వస్తోంది
‘అవ్వా పెన్షన్‌ వస్తోందా’అంటూ మంత్రి కేటీఆర్‌ ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. దేవరకొండ పట్టణంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10వ వార్డులో ఆయన పర్యటించారు. వీధిలో కూర్చున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది..  
కేటీఆర్‌: అవ్వా నీ పేరేంది..బాగున్నావా.. 
రుద్రాక్షి ముత్తమ్మ, బాగున్న.. 
కేటీఆర్‌: నీకు పెన్షన్‌ వస్తుందా..ఎంత వస్తుంది 
ముత్తమ్మ: వస్తుంది అయ్యా.. రూ.రెండు వేలు ఇస్తున్నరు 
కేటీఆర్‌: కంటి ఆపరేషన్‌ చేయించుకున్నట్లుంది..ఎక్కడ, ఎవరు చేశారు? 
ముత్తమ్మ: అవునయ్య..కళ్లు సరిగా కనపడడం లేదు. కంటివెలుగులో చూయించుకున్నా. పరీక్షలు చేసిండ్రు. నల్లగొండకు పంపితే అక్కడ ఆపరేషన్‌ చేసిండ్రు.  
కేటీఆర్‌: అద్దాలు బాగున్నయ్‌  
ముత్తమ్మ: ఆపరేషన్‌ చేసినంక వారే ఇచ్చారు. అయ్యా.. నాకు డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పించు నాయనా..

ఢిల్లీ హింస బాధాకరం: కేటీఆర్‌
దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస చాలా బాధాకరమని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘భారతీయులంతా అత్యంత సున్నిత మనస్కులని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తలెత్తిన భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరముంది’అని మంగళవారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు