పోలీసు అభ్యర్థులారా.. జర జాగ్రత్త!

21 Mar, 2019 03:20 IST|Sakshi

దళారులను నమ్మొద్దు.. పారదర్శకంగా నియామక పరీక్షలు

ఎర వేసే నకిలీ ఈ–మెయిళ్లు, వెబ్‌సైట్లను మా దృష్టికి తీసుకురండి

దరఖాస్తుల్లో తప్పుల సవరణకు త్వరలో ఎడిట్‌ ఆప్షన్‌

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాల కోసం వివిధ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని పోలీసుశాఖ సూచించింది. నకిలీ ఈమెయిళ్లు, వెబ్‌సైట్లు సృష్టించి దళారులు అభ్యర్థులను మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత పోలీసు నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు లేదని బుధవారం తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) స్పష్టంచేసింది. అభ్యర్థులకు నకిలీ ఈ–మెయిళ్లు, వీడియోలు పంపి మోసగాళ్లు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తారని.. ఇలాంటి ఈ–మెయిళ్లు వచ్చినా, వెబ్‌సైట్లు కనిపించిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఈ తరహా మోసాలకు పాల్పడేవారికి ఎలాంటి నగదు చెల్లింపులు చేయవద్దని తెలిపింది. అన్ని పరీక్షల ఫలితాల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ (https://www.tslprb.in) వెబ్‌సైట్‌లోనే తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఇతర సందేహాలు ఏమైనా ఉంటే.. 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. 

అభ్యర్థులకు పెర్ఫామెన్స్‌ షీట్లు.. 
నియామక ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేసుకునే విధంగా ఈ సారి పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. ఇందుకోసం గత 5 వారాలుగా వివిధ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఆయా పరీక్షల వారి పెర్ఫామెన్స్‌ షీట్లను వారికి ఆన్‌లైన్‌ ద్వారా పంపామని వివరించింది. ఇప్పటివరకు దాదాపుగా 2,17,361 మంది అభ్యర్థులకు జారీ చేశామని తెలిపింది. వీరంతా వారి ఐడీల ద్వారా లాగిన్‌ అయి చూసుకోవచ్చంది. ఇంకా 250 పెర్ఫామెన్స్‌ షీట్లు మాత్రం సాంకేతిక కారణాల వల్ల పంపలేకపోయామని, వాటినీ త్వరలోనే పంపుతామంది. ఇక దరఖాస్తులు సమర్పించే సమయంలో కొందరు అభ్యర్థులు కొన్నిచోట్ల పొరపాట్లు చేశారని తెలిపింది. ఈ విషయంలో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వీరందరూ నిరభ్యంతరంగా తర్వాతి పరీక్షలు రాసుకోవచ్చని సూచించింది. త్వరలోనే ఎడిట్‌ ఆప్షన్‌ కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని బోర్డు వెల్లడించింది. 

ఫిజికల్‌ టెస్ట్‌ల సమయంలో తప్పులు జరిగితే.. 
దేహదారుఢ్య పరీక్షల సమయంలో కుల ధ్రువీకరణ పత్రం సమర్పణలో జాప్యం చేసిన అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్‌ మేన్ల ఆప్షన్లు, జెండర్‌ విషయంలో తప్పులు చేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఏమైనా మార్పులు చేయాలనుకునే వారు.. ఈ నెల 28, 29న అంబర్‌పేట పోలీస్‌గ్రౌండ్‌ (ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)లో చీఫ్‌ సూపరింటెండెంట్, ఇతర అధికారులను ఉదయం 6 గంటల తర్వాత కలవొచ్చని బోర్డు సూచించింది. అభ్యర్థుల సమస్యలు విన్న తర్వాత వారు పరిష్కరిస్తారని బోర్డు తెలిపింది. 

మరిన్ని వార్తలు