పారదర్శకంగా సర్వే

10 Aug, 2014 00:31 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  అక్రమార్కుల ఏరివేతే లక్ష్యంగా ‘ఇంటింటి సర్వే’ జరుగుతుందని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ సర్వేకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. సర్వే నిర్వహణలో ఎలాంటి అపోహలకు తావులేదని, భయపడాల్సిన అవసరంలేదని ఆయన భరోసా ఇచ్చారు.

 ఈ నెల 19న చేపట్టే ‘ఇంటింటి సర్వే’పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సందేహాల నివృత్తికి శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొత్త రాష్ర్టంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే ఒకేరోజు ప్రతి ఇంటిని సర్వే చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సర్వే పేరుతో రేషన్‌కార్డులు ఏరివేస్తారని, స్థానికత నిర్ధారిస్తారనే ప్రచారం సరికాదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జేసీ-2 ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.

 ఆచరణ సాధ్యం కాదు: మంచిరెడ్డి
 సామాజిక సర్వేను ఒకే రోజు పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. చాంతాడంతా ప్రశ్నావళిని పూరించేందుకు సగ టున ఒక కుటుంబానికి 40 నిమిషాల సమయం పడుతుందని, సమాచార సేకరణలో ఏ మాత్రం ఏమరుపాటు వహించినా లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. 91 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిలో చాలావరకు ప్రజలను తికమక పెట్టేవే ఉన్నాయన్నారు.

సర్వే రోజున ఇంట్లో లేకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే భయాందోళనలకు గురిచేస్తున్నారని, జిల్లాలో వేలాది మంది కూలీలు ముంబై, పుణే తదితర ప్రాంతాలకు వలస వెళ్లారని, హైదరాబాద్‌లో చాలా కుటుంబాలు స్థిరపడ్డాయని, వారి విషయంలో అనుసరించే విధానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, ఇది నిర్వహిస్తున్న తీరే సహేతుకంగా లేదని అన్నారు. 15.12 లక్షల ఇళ్లను ఆదరాబాదరగా సర్వే చేస్తే నష్టపోయేది అర్హులేనని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అధికారుల పొరపాట్లతో రేషన్‌కార్డులు కోల్పోయిన కుటుంబాలెన్నో ఉన్నాయని, ఇప్పుడు ఈ సర్వేలో అలాంటి తప్పిదాలే పునరావృతమైతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
 
 సర్వే ఏమైనా భగవద్గీతా?: నాగేశ్వర్
 సర్వే సమంజసమే అయినా, దాన్ని భగవద్గీతగా భావించాల్సిన అవసరంలేదని ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. ప్రశ్నావళికి కుటుంబ సభ్యులిచ్చే సమాధానంలో వాస్తవం ఉందా? లేదా అనే విషయాన్ని తేల్చుకునేందుకు ఎన్యుమరేటర్ల దగ్గర డేటాబేస్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. సర్వేను సందేహించాల్సిన అవసరంలేదని, ఇదేమీ భగవద్గీతగా భావించవద్దని స్పష్టం చేశారు.

కుటుంబ యజమాని ఇచ్చే సమాచారంలో నిజానిజాలెంతో ప్రభుత్వమే గుర్తించాలన్నారు. ఆస్తులు ప్రకటించే  విషయంలో ప్రజాప్రతినిధులే అవాస్తవాలు చెప్పారని, అలాం టప్పుడు ప్రజలంతా సరిగ్గా సమాధానాలు చెబుతారని అనుకోవడం సరికాదని అన్నారు. ప్రశ్నావళికి అనుబంధంగా ఉప ప్రశ్నలు సంధిస్తేనే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.

 గుడిసెవాసుల పరిస్థితేంటీ? :  మాధవరం కృష్ణారావు
 హడావుడిగా సర్వే చేస్తే తప్పులుదొర్లే అవకాశముందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అవసరమైతే అదనంగా మరో రెండు పొడిగించడం ద్వారా సర్వేను సమగ్రంగా నిర్వహిస్తే సత్ఫలితాలుంటాయని పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో షంషీగూడ ప్రాంతంలో వందలాది గుడిసెవాసులు నివసిస్తున్నారని, వీటికి ఇంటినంబర్లు లేనందున ఎలా పరిగణనలోకి తీసుకుంటారని సంశయాన్ని వ్యక్తం చేశారు. ప్రజలను ఆందోళనకు గురిచేయకుండా సర్వేను సాఫీగా నిర్వహించాలని కోరారు.

 సర్వేపై ఫీడ్‌బ్యాక్ తీసుకోండి: వివేక్
 ఆఘమేఘాల మీద సర్వేను నిర్వహించకుండా మూడు రోజుల ముందే ఈ సర్వే ప్రక్రియను చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేఎం వివేక్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా... ఏకపక్షంగా సర్వే నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే ప్రజల్లో అపోహలకు దారితీసిందన్నారు. ఏడాది పొడవునా జరిగే ఓటర్ల నమోదులోనే ఎన్నో పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయని, ఒకే రోజు సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లుతాయోననే ఆందోళన నెలకొందన్నారు.

 సీమాంధ్రుల ఏరివేతకే : యాదయ్య
 ప్రభుత్వ పథకాల జాబితా నుంచి సీమాంధ్రులను తొలగించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, అదే నిజమైతే సర్వేను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఎన్నో సర్వేలు నిర్వహించారని, ఎమర్జెన్సీ తలపించేలా ఇప్పుడు చేస్తున్న సర్వే మాత్రం గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

 చాలా ఆందోళనలున్నాయి: గాంధీ
 గ్యాస్ కనెక్షన్లు తొలగించడానికే సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, సర్వేలో శాస్త్రీయత పాటించకపోతే అనర్థాలకు దారితీస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ప్రతి ఇంటి వివరాలను పక్కాగా సేకరించాలని, ఏ మాత్రం తేడా వచ్చినా ఎన్యుమరేటర్లనే బాధ్యులను చేయాలని సూచించారు.

 పేదలను పట్టించుకోండి: తీగల
 ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నందనవనం, రాజీవ్‌గృహాకల్ప కాలనీల్లో లబ్ధిదారుల స్థానే కొత్తవారు నివస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సర్వే పేరుతో వారి పేర్లను తొలగించే ఆలోచన చేయకూడదని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు . పేదల పక్షంగా సర్వే ఉండాలే తప్ప... కార్డుల ఏరివేత లక్ష్యంగా సాగకూడదని అన్నారు.

 వలసజీవుల పరిస్థితేంటి: టీఆర్‌ఆర్
 పరిగి నియోజకవర్గంలో వేలాది గిరిజన కుటుంబాలు ఉపాధి నిమిత్తం ముంబై, పుణే ప్రాంతాలకు వెళ్లాయ ని, వీరి వివరాల నమోదులో జాగ్రత్తలు తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. డోర్‌లాక్ ఉన్న ఇంటికి సంబంధించిన సమాచారాన్ని పొరుగువారి నుంచి సేకరిస్తామని చెబుతున్నారే తప్ప దాంట్లో వాస్తవమెంతో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఒక ప్రశ్నను పొందుపరిస్తే బాగుంటుందని సూచించారు.

 మన మంచికే: సంజీవరావు, సుధీర్‌రెడ్డి
 ప్రభుత్వ పథకాలు పేదలకే అందాలనే సంకల్పంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు వికారాబాద్, మేడ్చల్ ఎమ్మెల్యేలు సంజీవరావు, సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా సర్వేకు సహకరించాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు పక్కదారి పట్టినందువల్లే ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు.

 రామోజీ ఫిల్మ్‌సిటీ, సంఘీ కంపెనీలు తమ కార్మికుల వివరాలను కూడా నమోదు చేయకుండా సర్వే సిబ్బందిని తమ ప్రాంగణాల్లోకి అనుమతించవని, వీటి విషయంలో చొరవ చూపాలన్నారు. ప్రభుత్వ ఇల్లు ఉందా అనే విషయంలో అనేక సందేహలున్నాయని, వీటిని నివృత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి కోరారు.

 కంపెనీలకు హాలీడే ప్రకటించాలి:  ప్రకాశ్‌గౌడ్
 సర్వే రోజున పరిశ్రమలకు సెలవు ప్రకటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సూచించారు. సుమారు ఐదారు వేల మంది పేదలు కంపెనీల్లో పనిచేస్తున్నందున వారి వివరాలు సేకరించేందుకు సర్వే సిబ్బంది కూడా అక్కడకు వెళ్లాలని కోరారు.

 పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్ శ్రీధర్
 ‘సర్వేను నిష్పాక్షికంగా నిర్వహిస్తాం. ఇందులో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. సర్వే కు సరిపడా ఎన్యుమరేటర్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినా ప్రైవేటు ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌సేవలను వినియోగించుకోవడం ద్వారా సమస్యను అధిగమిస్తాం. జీహెచ్‌ఎంసీ మినహా జిల్లాలో 7.41లక్షల ఇళ్లు ఉన్నాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న సభ్యుల వివరాలు సేకరించేందుకు 28,549 మందిని నియోగిస్తున్నాం.

 ప్రతి ఎన్యుమరేటర్‌కు సర్వే తీరు, ప్రశ్నావళిని పూరించే విధానంపై 11, 12,13వ తేదీల్లో శిక్షణ ఇస్తున్నాం. సర్వే రోజున ఉదయం 6 గంటలకే మండల కేంద్రం నుంచి ఎన్యుమరేటర్లు నిర్దేశించిన గ్రామానికి తరలివెళ్లేలా రవాణా సౌకర్యాలు చేపట్టాం. దాదాపు పోలింగ్ విధుల్లో ఎలా వ్యవహరించామో... ఇప్పుడు అదే విధానాన్ని అవలంబిస్తున్నాం. సెక్టార్లవారీగా సర్వే సిబ్బందిని రంగంలోకి దించుతాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ఉంటుంది.

ఎన్యుమరేటర్లు సేకరించిన డేటాను మూడు వారాల్లో కంప్యూటరీకరిస్తాం. కుటుంబ సర్వేపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన కల్పించాం. 19వ తేదీన ప్రభుత్వ హాలీడే ప్రకటిస్తున్నాం. స్థిరనివాసం ఎక్కడ ఉంటే అక్కడే పేర్లు నమోదు చేసుకోవడం ఉత్తమం. ప్రభుత్వ పథకాల్లో అర్హుల ఏరివేత, సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికే ఈ సర్వే.  ఏ మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా.. సదరు కుటుంబ యజమానిదే బాధ్యత. అందుకనుగుణంగా సదరు యజమాని సంతకం కూడా తీసుకుంటాం.

మరిన్ని వార్తలు