అత్యాధునిక వైద్యం.. నిమ్స్‌ సొంతం

7 Mar, 2020 07:39 IST|Sakshi

నిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సూట్లు

ఈవినింగ్‌ ఓపితో పాటు హెల్త్‌ చెకప్‌లు

అందరికీ అందుబాటులో సేవలు

లక్డీకాపూల్‌ : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో సామాన్యుడికి సైతం అత్యాధునిక వైద్యం అందుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్‌ ఎప్పటికప్పడు కొత్త పద్ధతులను అవలంబిస్తోంది.  నిరుపేదలకు సైతం కార్పొరేట్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యజామాన్యం దృష్టి పెట్టింది.ఈ క్రమంలో భాగంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సూట్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  28 విభాగాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ప్రతిష్టాత్మకంగా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తుంది. ఇప్పటికే లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ శస్త్ర చికిత్సలను ఆరోగ్య శ్రీ రోగులకు సైతం చేస్తున్నారు. ఈ  క్రమంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎనిమిది ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సూట్‌లను ఏర్పాటు చేశారు. ఆరోగ్య శ్రీ రోగులకు సైతం ఈ సూట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సూట్స్‌ను మిలీనియం బ్లాక్‌లో నిర్మించారు.  బోన్‌ మ్యారో చికిత్సలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. యూరాలజీ విభాగం పర్యవేక్షణలో కొనసాగే స్టెమ్‌ సెల్స్‌ విభాగాన్ని రూ. 20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. దీనిని మిలీనియం బ్లాక్‌లోని ఐదవ అంతస్తులో ఏర్పాటు చేశారు.  

ఎట్టకేలకు స్టెమ్‌ సెల్స్‌ యూనిట్‌..  
దశాబ్దకాలంలో ప్రతిపాదన దశలో ఉన్న ఈ యూనిట్‌ ఎట్టకేలకు కార్యరూపంలో వచ్చింది. ఈ విషయంలో  నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మనోహర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తం మీద నిమ్స్‌లో కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా మెరుగైన వైద్య సేవలు పేదల ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో యాజమాన్యం ఉంది. ఇప్పటికే సాధారణ అవుట్‌ పేషెంట్‌ విభాగంతో పాటు ఈవినింగ్‌ ఓపీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  రూ. 500 స్పెషల్‌ ఓపీలో వైద్య సేవలను అందుకుంటున్నారు. ఒక విభాగానికి ఓపీ కార్డు తీసుకుని దాంతో పాటు మరో విభాగంలో వైద్య సలహాలు పొందాలంటే మరో రూ. 200లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకు ఆ కార్డు కాల పరిమితిని 14 రోజుల పాటు ఉంటుంది. ఈ విధంగా వైద్య సేవలను సరళతరం చేస్తున్నారు. 

హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలు..
హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది. నిమ్స్‌ ఓల్డ్‌ బిల్డింగ్‌లోని గతంలో క్యాథ్‌ల్యాబ్‌ విభాగాన్ని నిర్వహించిన ప్రాంతంలో ఈ పరీక్షలనున ఇర్వహిస్తున్నారు. ఓపీ కౌంటర్లతో ప్రమేయం లేకుండానే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. దానికి అదనంగా ఆయుష్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రకృతి వైద్య విభాగానికి చెందిన ఈ ఆయూష్‌ కేంద్రంలో రోగులకు ఆహారపు అలవాట్లు పట్ల అవగాహన కల్పించడమే కాకుండా యోగ ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం స్వస్ధత చేకూరే విధంగా వైద్య సేవలను అందిస్తున్నారు. ఆ విధంగా వెల్‌నెస్‌ సెంటర్‌ పేరుతో కొనసాగుతున్న విభాగంలో ఆయూష్, హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఈ క్రమంలో ఆధునాత పద్ధతుల్లో ఫుడ్‌ కోర్డ్‌ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ విషయంలో డైరెక్టర్‌ మనోహర్‌ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు