ట్రాన్స్‌పోర్టు డీసీఎం సోదా

19 Jul, 2018 13:56 IST|Sakshi
డీసీఎంలో సోదా చేస్తుండగా గుమిగూడిన స్థానికులు

ఎక్సైజ్‌ అధికారుల తీరుకు నిరసనగా  దుకాణాలు మూసివేసిన వ్యాపారులు

లింగాలలో ఉద్రిక్తంగా   మారిన పరిస్థితులు

ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు

లింగాల (అచ్చంపేట) : హైదరాబాద్‌ నుంచి మండల కేంద్రమైన లింగాలకు వచ్చిన ట్రాన్స్‌పోర్టు డీసీఎంను బుధవారం ఆకస్మికంగా ఎస్సైజ్‌ శాఖ వారు సోదాలు నిర్వహించారు. డీసీఎంలో హైదరాబాద్‌ నుంచి సారాకు వినియోగించే బెల్లం రవాణా అవుతుందన్న సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు జరిపారు. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న వివిధ నిత్యావసర సరకులను కిందకు దింపి పరిశీలించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

సోదాలను వ్యాపారులు, ప్రజలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. డీసీఎం నుంచి దాదాపు 180 కిలోల బెల్లాన్ని ఎక్సైజ్‌ శాఖ వారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. అలాగే విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరు వ్యాపారులపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చేశామన్నారు.

ఇదిలా ఉండగా సోదాలను ఖండిస్తూ వ్యాపారులు దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. తాము ప్రజలు నిత్యం వాడుకునే తెల్లబెల్లం మాత్రమే విక్రయిస్తున్నామన్నారు. వ్యాపారులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు