అమలు సరే.. అమ్మేవారెవరు..!

5 Jul, 2019 07:46 IST|Sakshi

స్పీడ్‌ గవర్నర్స్‌కు ముంచుకొస్తున్న గడువు

ఇంకా ఖరారు కాని అధీకృత విక్రేతల జాబితా

ఏఆర్‌ఏఐ అనుమతి ఉన్న డీలర్లే  విక్రయించాలి

ఐదు రకాల వాహనాలకు వేగనియంత్రణ

పరికరాలు తప్పనిసరి

సాక్షి, సిటీబ్యూరో: వాహనాల వేగానికి కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమైంది. రహదారి భద్రత దృష్ట్యా రవాణా వాహనాలు పరిమితమైన వేగంతోనే పరుగులు తీయాలని ఆదేశించింది. వేగాన్ని  నియంత్రించే పరికరాలైన స్పీడ్‌గవర్నర్స్‌ను  ఏర్పాటు చేసుకోవాలని  స్పష్టం చేసింది. ఇవి  లేని వాహనాలను ఫిట్‌నెస్‌ లేని వాటిగా గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు హెచ్చరించారు. స్కూల్‌ బస్సులతో పాటు మరో నాలుగు రకాల వాహనాలకు ఈ నిబంధనను తప్పనిసరి చేశారు. స్కూళ్లు  తెరుచుకొనే నాటికే  దీనిని అమలు చేయాలని భావించినప్పటికీ సమయం తక్కువగా ఉండడం వల్ల ఆగస్టు వరకు పొడిగించారు. అయితే ఇప్పటి వరకు స్పీడ్‌గవర్నర్‌లను విక్రయించే డీలర్లు, తయారీదారుల జాబితాను మాత్రం  ఆర్టీఏ సిద్ధం చేయలేదు. వచ్చే నెల ఒకటో తారీఖు నుంచే అమలు కావలసిన ఈ నిబంధనపై  అధికారుల నిర్లక్ష్యం  స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు రవాణాశాఖ అనుమతి లేని విక్రయ సంస్థల నుంచి ఏర్పాటు చేసుకొనే  స్పీడ్‌ గవర్నర్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పరిగణనలోకి తీసుకోబోమని రవాణా అధికారులు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవైపు స్పీడ్‌ గవర్నర్ల ఏర్పాటును తప్పనిసరి చేసిన అధికారులు మరోవైపు అధీకృత డీలర్లు, విక్రేతలను  ఇప్పటి వరకు నిర్ధారించకపోవడం వాహనదారులను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో  ఆగస్టు నుంచి స్పీడ్‌గవర్నర్లు ఏ మేరకు అమలు జరుగుతాయనే దానిపై సందేహం నెలకొంది.  

వేగానికి కళ్లెం ఇలా...
రహదారి భద్రత దృష్ట్యా అన్ని రకాల రవాణా వాహనాలకు వేగాన్ని నియంత్రించారు. నగరంలో తిరిగే స్కూల్‌ బస్సులు, చెత్త తరలింపు వాహనాలు, నీళ్ల ట్యాంకర్లు, 8 సీట్ల కంటే ఎక్కువ ఉన్న మ్యాక్సీ క్యాబ్‌లు గంటకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లకుండా స్పీడ్‌ గవర్నర్‌లు అమర్చుకోవాలి. హైవేలపైన  రాకపోకలు సాగించే సరుకు రవాణా లారీలు, ప్రయాణికుల రవాణా బస్సులు  గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు. ఇందుకనుగుణంగా స్పీడ్‌ గవర్నర్‌లను ఏర్పాటు చేయాలి. 2015 అక్టోబర్‌  1 నుంచి నమోదైన రవాణా వాహనాలకు  ఇది వర్తిస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, క్వాడ్రాసైకిళ్లు, ఫైరింజన్‌లు, అంబులెన్సులు, పోలీసు వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. ఈ వాహనాలకు మినహాయింపును ఇచ్చారు. 2020 నాటికి రోడ్డు ప్రమాదాలను  20 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ నిబంధన జూన్‌  రెండో వారం నుంచే అమలు చేయాలని భావించినప్పటికీ  అప్పటికే చాలా వరకు స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు ముగిసి విద్యార్థులకు అందుబాటులోకి రావడంతో గడువును ఆగస్టు వరకు పొడిగించారు.  

ఏఆర్‌ఏఐ ఆమోదించిన విక్రేతలెవరు...
వాహనాల ఇంజన్‌ సామర్థ్యం, వేగ నియంత్రణ ప్రమాణాలు, తదితర అంశాలపై  అధ్యయనం చేసి ఆమోదించే  ఆటోమొబైల్‌ రీసెర్చ్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నుంచి ఆమోదం పొందిన స్పీడ్‌గవర్నర్లను మాత్రమే  వాహనాలకు బిగించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఇలా  ఏఆర్‌ఏఐ నుంచి అనుమతులు పొందిన విక్రయ సంస్థలు, డీలర్లు  రవాణా కమిషనర్‌ నుంచి  ధృవీకరణ పొందాలి. ఏఆర్‌ఏఐ అనుమతులు కలిగి, తమ వద్ద నమోదైన విక్రేతల జాబితాను   రవాణాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఈ జాబితాలో ఉన్న డీలర్లు లేదా విక్రయ సంస్థల నుంచి మాత్రమే వాహనదారులు స్పీడ్‌గవర్నర్‌లను కొనుగోలు చేయాలి. అయితే ఇప్పటి వరకు అలాంటి జాబితాను రవాణా అధికారులు సిద్ధం చేయలేదు. పైగా తమ వద్ద గుర్తింపు లేని డీలర్ల నుంచి స్పీడ్‌ గవర్నర్‌లను ఏర్పాటు చేసుకుంటే  పరిగణనలోకి తీసుకోబోమంటూ తాజాగా ప్రకటించడం గమనార్హం.  

>
మరిన్ని వార్తలు